‘సృష్టి’ కేసు మరువకముందే మరో అక్రమ సరోగసీ కేసు
పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీకొడుకు అరెస్ట్;
సృష్టి ఫెర్టిలిటీ కేసు మరవకముందే హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫెర్టిలిటీ కేంద్రం గుట్టు రట్టయింది. అక్రమంగా సరోగసి, ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే తల్లి కొడుకులు నిర్వహిస్తున్న ఫెర్టిలిటీ కేంద్రంపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. ఎపికి చెందిన నర్రెద్దుల లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎంచుకున్న తల్లీ కొడుకులు ఎగ్ డోనర్, సరోగసి మదర్‌గా ఒప్పందాలు చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. లక్ష్మి రెడ్డికి ఎగ్ డోనర్, సరోగసీ మదర్ అనుభవం ఉంది అని పోలీసులు తెలిపారు. . లక్ష్మి రెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్నారు.2024లో ఆమెపై సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రి ప్రొడక్టివిటీ టెక్నాలజీ యాక్ట్ క్రింద కేసులు నమోదయ్యాయి.ఈ కేసులో ఆమె కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. మహరాష్ట్ర పోలీసులు ఆమెపై కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు.
తల్లి కొడుకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి జెఎన్ టియులో కెమికల్ ఇంజినీర్ చదివాడు. అమ్మకు తోడుగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ అక్రమ వ్యాపారంలో దిగాడు.
తల్లి కొడుకుల నుంచి ఆరు లక్షల 47 వేల రూపాయలను, లెనోవో ల్యాప్ ట్యాప్,ఐదు స్మార్ట్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లను, గర్బధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.