తెలంగాణలో జనసేనతో కలిసి పని చేయడంపై బండి రియాక్షన్

తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన కలిసి పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేశారు.

Update: 2024-06-30 14:09 GMT

తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన కలిసి పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేశారు. శనివారం ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణాలో జనసేన బీజేపీతో కలిసి పనిచేస్తుంది అనడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన బండి... పవన్ కళ్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచారని అన్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు, పార్టీలోని ఇతర నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో బీజేపీతో జనసేన కలిసి నడవడం కొత్తగా తెరపైకి వచ్చిన అంశం కాదు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచీ.. తెలంగాణలో పోటీ చేయనప్పుడు కూడా మద్దతుగా నిలిచారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తెలంగాణలోని 8 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. అయితే ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదు. ఇప్పుడు ఏపీలో నిలబడిన అన్నిచోట్లా జనసేన విజయబావుటా ఎగరవేసింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. తెలంగాణలోనూ పొత్తులోనే వ్యూహాత్మక రాజకీయ అడుగులు వేయాలని జనసేన ప్రణాళికలు రచిస్తోన్నట్టు కనిపిస్తోంది.

రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష... -బండి

నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి వహిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ శాసనసభ్యులకు నిధులు నిరాకరించడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తగినన్ని నిధులు కేటాయించడం జరుగుతోందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ప్రజలే ఎన్నుకున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, కేంద్రం కూడా ఇలాగే చేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. కేంద్రం కూడా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సంప్రదిస్తే వారికి సహకరిస్తున్నామన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లు తప్పుడు సందేశాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 

Tags:    

Similar News