రూ.16.70 లక్షల కోట్లతో బీఆర్ఎస్ ఏం నిర్మించింది: భట్టి
కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది మచ్చుకకు కూడా కనిపించలేదన్నారు భట్టి.;
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్‌పై ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది మచ్చుకకు కూడా కనిపించలేదన్నారు భట్టి. అడ్డగోలుగా అప్పులు తెచ్చారే తప్ప.. వాటిని ఎలా వాడారు అన్నది మాత్రం ఎన్నడూ చెప్పలేదని విమర్శించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్షరాలా రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఆ మొత్తంతో ఏం నిర్మించారో చెప్పాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు.
‘‘రూ.16.70 లక్షల కోట్లతో నాగార్జున సాగర్ నిర్మించారా? ఎస్ఆర్‌ఎస్పీ నిర్మించారా? ఓఆర్ఆర్ నిర్మించారా? ఎయిర్‌పోర్ట్ కట్టారా? ఒక్క కాళేశ్వరం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా కూలిపోయింది. సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టారు. తమ పదేళ్ల పాలనలో ఒక్క గ్రామంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారా? అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని కాగ్ స్వయంగా వెల్లడించింది. వాటిని ఏం నిర్మించడానికి వాడారు?’’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.
‘‘గత ప్రభుత్వం ఎప్పుడూ నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. బడ్జెట్ భారీగా పెట్టినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. 2016-17లో రూ.8వేల కోట్లు, 2018-19లో రూ.40వేల కోట్లు, 2021-22లో రూ.48 వేల కోట్లు, 2022-23లో రూ.52 వేల కోట్లు, 2023-24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదు. ఓఆర్ఆర్‌ను 30 ఏళ్లకు రూ.7వేల కోట్లకు అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వభూములను అమ్ముకున్నారు. కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు’’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.