కొండాసురేఖ నోరిప్పితే వివాదమేనా ? (వీడియో)

అప్పుడెప్పుడో సినీనటి సమంత(Samantha Ruth Prabhu)పై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే;

Update: 2025-05-16 09:29 GMT
Minister Konda Surekha

సీనియారిటి ఉందన్న మాటేకాని మంత్రి కొండాసురేఖ నోరిప్పితే వివాదమే. ఇంతసీనియారిటి ఉండికూడా నోటికెంతొస్తే అంత మాట్లాడేస్తారు. దాంతో మంత్రి స్వయంగా వివాదాల్లో ఇరుక్కోవటమే కాకుండా సహచరులను, ఇతరులను కూడా వివాదంలోకి లాగేస్తుంటారు. అప్పుడెప్పుడో సినీనటి సమంత(Samantha Ruth Prabhu)పై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. అప్పుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుంటుంబంలో రాజేసిన మంటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట మండుతునే ఉంది. అదిపూర్తిగా చల్లారకముందే తాజాగా సహచర మంత్రులందరినీ వివాదంలోకి లాగేశారు. ఒక్కసారిగా అందరిపైనా అవినీతి ముద్రవేసేశారు. రేవంత్ రెడ్డి(Revanth) క్యాబినెట్ మంత్రుల్లో తానొక్కతే నీతి, నిజాయితీతో పనిచేస్తున్నట్లు అర్ధమొచ్చేట్లుగా మాట్లాడి వివాదాన్ని రాజేశారు.

ఇంతకీ కొండా సురేఖ(Konda Surekha) ఏమన్నారంటే ‘ఫైళ్ళ క్లియరెన్సుకు మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుంటారు..కాని తాను మాత్రం సమాజహితం కోస పనిచేస్తున్న’ట్లు చెప్పారు. అసలు సందర్భం ఏమిటంటే వరంగల్ లోని కృష్ణాకాలనీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉంది. అరబిందో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సుబులిటి(సీఎస్ఆర్)లో భాగంగా భవనాల నిర్మాణాలకు మంత్రి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు ‘వర్షాకాలంలో కాలేజీ తరగతిగదులు నీళ్ళతో నిండిపోతున్న విషయాన్ని కలెక్టర్ తనతో చెప్పా’రన్నారు. ‘పాత భవనాన్ని కూలగొట్టి కొత్తది కట్టాల’ని కలెక్టర్ చెప్పారట. అందుకు రు. 4.5 కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలను కూడా కలెక్టర్ చెప్పినట్లు మంత్రి తెలిపారు. అంతడబ్బు ఎక్కడినుండి తీసుకురావాలో మంత్రికి దిక్కుతోచలేదట. ‘అటవీశాఖ మంత్రిగా తనదగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళు క్లియరెన్సుల కోసం వస్తుంటాయ’ని చెప్పారు.

‘మామూలుగా ఫైళ్ళ క్లియరెన్సుల కోసం మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తార’ని చెప్పారు. ‘అయితే తాను మాత్రం ఫైళ్ళ క్లియరెన్సుల కోసం తన దగ్గరకు వచ్చిన అరబిందో ఫార్మా వాళ్ళతో మాట్లాడినపుడు తనకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు సమాజ సేవ చేయాల’ని అడిగారట. ‘కాలేజీకి భవనాలు కట్టించి డెవలప్ చేయాల’ని అడిగినట్లు చెప్పారు. కాలేజీ భవనాలు నిర్మిస్తే కంపెనీ పేరు చిరస్ధాయిగా నిలిచిపోతుందని నచ్చచెప్పినట్లు కూడా మంత్రి తెలిపారు. చివరకు ‘సీఎస్ఆర్ పథకం కింద రు. 4.5 కోట్లతో భవనాలు కట్టేందుకు అరబిందో కంపెనీ అంగీకరించి’నట్లు చెప్పారు. ఆ నిధులతో గ్రౌండ్ ఫ్లోర్, రెండో అంతస్తులో 15 తరగతి గదులు, ఆడిటోరియం తరహాలు పెద్దహాలు, 60 అధునాతన టాయిలెట్లు, నూతన ఫర్మిచర్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి చెప్పారు.

మంత్రి మాట్లాడినదానిలో కార్పొరేట్ కంపెనీతో కాలేజీ భవనాలను నిర్మించబోతున్నాము అన్నదే కీలకమైన పాయింట్. అయితే మంత్రి చెప్పింది ఏమిటంటే ‘ఫైళ్ళు క్లియర్ చేయటానికి మంత్రులు డబ్బులు వసూలు చేస్తారు తాను మాత్రం అలా చేయకుండా తెలంగాణను ఉద్ధరిస్తున్నా’ను అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. కొండా వ్యాఖ్యలను విన్న జనాలంతా ఒక్కసారిగా షాకయ్యారు. తానుతప్ప సహచర మంత్రులందరు ఫైళ్ళ క్లియరెన్సుకు డబ్బులు వసూళ్ళు చేస్తున్నారని డైరెక్టుగా కొండానే చెప్పారు. మంత్రి వ్యాఖ్యలు విన్నవాళ్ళందరికీ అర్ధమైనది కూడా ఇదే. అయితే కొండా వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని మంత్రికి ఫుల్లుగా క్లాసు పీకినట్లున్నది.

కమీషన్ సర్కార్ గా మారిపోయింది : కేటీఆర్

అయితే ఈలోగానే ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాట్లాడుతు ‘తాము ఎప్పటినుండో చెబుతున్న 30 శాతం కమీషన్ వ్యవహారాలను మంత్రి కొండాసురేఖ ఇంతకాలానికి ఒప్పుకున్నార’ని ఎద్దేవాచేశారు. ‘మంత్రులు ముడుపులు తీసుకుంటున్నట్లు ఇప్పటికైనా కొండాసురేఖ బయటపెట్టినందుకు మంత్రికి తన హృదయపూర్వక అభినందనలు’ అన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ సర్కార్ గా మారిపోయి’నట్లు దెప్పిపొడిచారు. కమీషన్లు ఇవ్వలేని కాంట్రాక్టర్లు గతంలో సచివాలయంలో బిల్లుల కోసం ధర్నాచేసిన విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. ‘కమీషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లను బయటపెట్టాల’ని కొండాసురేఖను కేటీఆర్ డిమాండ్ చేశారు. కొండాసురేఖ చెప్పిన విషయాలపై ఇతర మంత్రుల అవినీతిమీద దర్యాప్తుచేయించే ధైర్యం రాహుల్ గాంధి(Rahul Gandhi), రేవంత్ రెడ్డికి ఉందా అని కేటీఆర్ సవాలు చేశారు.

దర్యాప్తుకు ఆదేశించాలి : కిషన్

మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యల ఆధారంగా క్యాబినెట్లోని ఇతర మంత్రులు ఎవరిదగ్గర ఎంతెంత కమీషన్లు తీసుకున్నారనే విషయమై రేవంత్ రెడ్డి దర్యాప్తుచేయించాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) డిమాండ్ చేశారు. మంత్రులందరు కమీషన్లు తీసుకుని ఫైళ్ళని క్లియర్ చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల ద్వారా బయటపడినట్లు కిషన్ చెప్పారు. మంత్రులు కమీషన్లు తీసుకుని ఫైళ్ళు క్లియర్ చేయటం చాలా బాధాకరమన్నారు. మంత్రులు తీసుకున్న కమీషన్లన్నింటినీ బయటపెట్టాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.

డ్యామేజీ కంట్రోలు

నోటికేదొస్తే అదిమాట్లాడేసే అలవాటున్న కొండాసురేఖ వ్యాఖ్యలు ఇపుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బాగా ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి రేవంత్ తో పాటు మంత్రులందరిపైనా కేటీఆర్ పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతకాలం కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నిజమే అని మంత్రి వ్యాఖ్యల ద్వారా జనాలకు అర్ధమైంది. మంత్రి వ్యాఖ్యల తర్వాత జరిగిన డ్యామేజీ కంట్రోల్ కు ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందుకనే మంత్రి తాజాగా కేటీఆర్ తదితరులను బెదిరిస్తు మీడియాతో మాట్లాడారు. తన మాటలను వక్రీకరించినట్లు చెప్పారు. మంత్రులు ఫైళ్ళ క్లియరెన్సుకు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పింది బీఆర్ఎస్ హయాంలో జరిగిన వ్యవహారాల గురించి అని కొండాసురేఖ ఇపుడు మాట మార్చారు. మంత్రి ఆలోచన అదే అయితే బీఆర్ఎస్ హయాంలో మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్ళు క్లియర్ చేసేవారని స్పష్టంగా చెప్పుండాలి. అలాచెప్పకుండా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్ళు క్లియర్ చేస్తారని చెప్పాల్సిన అవసరం ఏమిటి ? మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్ళు క్లియర్ చేస్తుంటే తాను మాత్రం పైసా తీసుకోకుండా కాలేజీ భవనాల కోసం డబ్బులు ఖర్చుపెట్టమని అరబిందో కంపెనీని అడిగినట్లు చెప్పటంలో అర్ధమేంటి ? తన సహచర మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్ళని క్లియర్ చేస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. వివాదం రాజుకున్న తర్వాత మాటమార్చి తనమాటలను వక్రీకరిస్తున్నారని, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించటంలో అర్ధమేలేదు. బురదలో కాలువేయటం తర్వాత కడుక్కోవటం మంత్రి కొండాసురేఖకు బాగా అలవాటైపోయింది.

Tags:    

Similar News