స్మితకు బిగ్ రిలీఫ్

స్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమే అని అరాథే అభిప్రాయపడ్డారు. అలాగే ఆమెచేసిన వ్యాఖ్యల వల్ల దివ్యాంగుల కోటాపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు.

Update: 2024-09-03 06:26 GMT
Senior IAS Officer Smitha Sabarwal

స్మితా సబర్వాల్ కు బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వాటిల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు ఇవ్వాలని స్మిత చేసిన ట్వీట్ పై ఎంత దుమారం రేగిందో అందరికీ తెలిసిందే. నకిలీ సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ కు ఎంపికైన మహారాష్ట్ర ట్రైనీ సబ్ కలెక్టర్ పూజా ఖేడ్కర్ ఉదంతం నేపధ్యంలో స్మితా సబర్వాల్ పై ట్వీట్ చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న స్మిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. స్మిత అలా ట్వీట్ పెట్టారో లేదో దివ్యాంగుల సంఘాలు పెద్ద గోలచేశాయి. సివిల్స్ కోచింగ్ ఇస్తున్న దివ్యాంగురాలు బాలలతతో పాటు సామాజిక కార్యకర్త వసుంధర కొప్పుల స్మితకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసువేశారు.

హైకోర్టులో కేసువేయటమే కాకుండా స్మితపై తమ నోటికొచ్చినట్లు ఆరోపణలతో రెచ్చిపోయారు బాలలత. ఏమిటేమిటో చాలెంజులు చేసేశారు. స్మిత దివ్యాంగులను అవమానించిందని, ఆమెపై వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని బాలలత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఈమె హెచ్చరికలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తన ట్వీట్ కు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరిగినా స్మిత మాత్రం తన ఆలోచనను మార్చుకునేది లేదని మరో ట్వీట్ చేశారు. దాంతో స్మితకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఆ కేసులను చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావు సోమవారం విచారించారు. ఇరువైపుల వాదనలను విన్న అరాథే స్మితకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను కొట్టేశారు.

స్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమే అని అరాథే అభిప్రాయపడ్డారు. అలాగే ఆమెచేసిన వ్యాఖ్యల వల్ల దివ్యాంగుల కోటాపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. ఒక అధికారిగా ఆమె ఎవరి రిజర్వేషన్ను కూడా తొలగించలేదని గుర్తుచేసింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతోనే స్మిత తన ఆలోచనలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారని చీఫ్ జస్టిస్ చెప్పారు. కాబట్టి స్మిత చేసిన వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించినట్లుగా చూడలేమని కూడా అన్నారు. విమానయాన సంస్ధలు దివ్యాంగులను పైలెట్లుగా పెట్టుకుంటాయా ? దివ్యాంగ సర్జన్ దగ్గర ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటారా ? అన్న స్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమే అని అరాథే తేల్చిచెప్పారు. వ్యక్తిగత అభిప్రాయం చెప్పేహక్కు స్మితకు రాజ్యాంగం ప్రసాదించిందని కూడా ధర్మాసనం స్పష్టంగా అభిప్రాయపడింది.

అప్పట్లో దివ్యాంగుల కోటాను సివిల్స్ లో రద్దుచేయాలని ఆమెచేసిన ట్వీట్ పెద్ద సంచలనమైంది. ఆమెకు వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వైరలయ్యాయి. దివ్యాంగుల రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై జరిగిన గొడవలో ఆమె బాగా ఇరుక్కున్నారని సంతోషించిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిరోజుల పాటు కొనసాగిన ఈ దుమారం ప్రభుత్వానికి చుట్టుకుంటుందనే అనుమానించారు. అయితే తనకు వ్యతిరేకంగా ఎవరేమి మాట్లాడినా స్మిత మాత్రం అభిప్రాయాన్ని మార్చుకోనని ఖండితంగా తేల్చిచెప్పారు. నిజానికి స్మిత ఎవరిని ఉద్దేశించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేయలేదు. కాకపోతే బాలలత లాంటి వాళ్ళు కొందరు ఓవర్ రియాక్టవుతున్నారనే ఆరోపణలు కూడా అప్పట్లోనే వినబడ్డాయి. బాలలత స్పందనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చర్చజరిగింది. ఏదేమైనా అంతటి దుమారంరేపిన వివాదానికి తాజాగా హైకోర్టు ముగింపు పలకటం స్మితకు బిగ్ రిలీఫనే చెప్పాలి.

Tags:    

Similar News