బీజేపీతో తెగిపోయిన రాజాసింగ్ బంధం
రాజాసింగ్ పార్టీకి జూన్ 30వ తేదీన చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు;
గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ కు బీజేపీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది. ఎందుకంటే రాజాసింగ్ పార్టీకి జూన్ 30వ తేదీన చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈమేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ(Telangana BJP) అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావును జాతీయ నాయకత్వం ఎంపికచేసింది. ఈ ఎంపికను నిరసిస్తు రాజాసింగ్(MLA Rajasingh) పార్టీకి రాజీనామా చేశారు. రాజాసింగ్ ఎంతటి తెలివైన వ్యక్తి అంటే ఎంఎల్ఏ పదవికి కాకుండా కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశాడు. బహుశా తాను చేసిన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించదని అనుకున్నట్లున్నాడు. దీనికి తగ్గట్లుగా పార్టీ తెలంగాణ ఇన్చార్జి సునీల్ బన్సల్ ఎంఎల్ఏతో భేటీ అయ్యారు. రాజీనామాను ఉపసంహరించుకునేట్లుగా ప్రయత్నించారు.
అయితే రాజాసింగ్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్నట్లుగా వ్యవహరించారు. దాంతో కేంద్రమంత్రి, తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సిఫారసుతో జాతీయ అధ్యక్షుడు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. నిజానికి ఎంఎల్ఏ పార్టీలో ఉండటం చాలామందికి ఏమాత్రం ఇష్టంలేదు. ఎందుకంటే పార్టీలో ఉంటూనే పార్టీలైనుకు విరుద్ధంగా ఎంఎల్ఏ చాలాసార్లు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. రాజాసింగ్ దూకుడువల్ల పార్టీ గతంలో చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఈ విషయాన్ని రాజాసింగ్ కు ఎన్నిసార్లు కొందరు సీనియర్లు చెప్పినా ఎంఎల్ఏ తన ధోరణిని మార్చుకోలేదు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ అభ్యర్ధిగా మాధవీలతకు టికెట్ విషయంలో కూడా నోరుపారేసుకున్నాడు. పార్టీలో మగాడే లేనట్లుగా ఎంపీ టికెట్ మాధవికి ఇవ్వటం ఏమిటని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేయటం అప్పట్లో సంచలనమైంది.
బీజేపీ శాసనసభాపక్ష నేతగా రాజాసింగ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. వివిధ కారణాలతో రాజాసింగ్ కు బీజేపీఎల్పీ నేత పదవిని జాతీయ నాయకత్వం ఇవ్వలేదు. అలాగే ఇపుడు తెలంగాణ అధ్యక్ష పదవిని కూడా ఆశించినా భంగపాటు తప్పలేదు. దాంతో పార్టీలో ఉండటం అనవసరమని అనుకున్న రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇన్నిరోజులు ఉపేక్షించిన నాయకత్వం చివరకు లాభంలేదని అనుకుని రాజీనామాను ఆమోదించింది.
హ్యాట్రిక్ ఎంఎల్ఏ
పార్టీకి చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు ఆమోదించటంతో రాజాసింగ్ ఇపుడు స్వతంత్ర ఎంఎల్ఏగా కంటిన్యు అవుతారు. కాబట్టి పార్టీ లైనుకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా రాజాసింగ్ ఇకపై రెచ్చిపోయే అవకాశాలున్నాయి. గోషామహల్ నుండి రాజాసింగ్ వరుసగా మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్నారు. 2014లో గెలిచినపుడు రాష్ట్రం మొత్తంలో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏగా కూడా రాజాసింగ్ చరిత్ర సృష్టించారు. బీజేపీతో సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది కాబట్టి స్వతంత్రంగానే ఉంటారా ? లేకపోతే ఏదైనా పార్టీలో చేరుతారా అన్నది చూడాలి.