బీజేపీ అభ్యర్ధి అవటమే అంజిరెడ్డి లక్కీనా ?

పార్టీబలానికి మించి ఇతర అంశాలు కారణమైనపుడు గెలిచిన అభ్యర్ధిని లక్కీ అనకుండా ఎలా ఉండగలం ?;

Update: 2025-03-06 07:50 GMT
BJP Graduate MLC Ch Anji Reddy

మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో గెలిచిన బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డిని వెరీ లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే అంజిరెడ్డి గెలుపుకు పార్టీ బలంకన్నా వెలుపలి కారణాలు ఎక్కువగా కారణం అవ్వటమే. మామూలుగా ఏ అభ్యర్ధయినా ఎన్నికల్లో పోటీచేయటానికి సొంతపార్టీ బలమే ప్రధాన కారణమవుతుంది. అలాకాకుండా పార్టీబలానికి మించి ఇతర అంశాలు కారణమైనపుడు గెలిచిన అభ్యర్ధిని లక్కీ అనకుండా ఎలా ఉండగలం ? ఇంకీ విషయం ఏమిటంటే అంజిరెడ్డి(Ch Anji Reddy) గెలుపులో పార్టీకి సంబంధంలేని అనేక అంశాలు కారణమయ్యాయి.

ఇంతకీ అంజిరెడ్డి గెలుపుకు సహకరించిన కారణాలను చూద్దాం. అవేమిటంటే కాంగ్రెస్(Congress) అభ్యర్ధికన్నా దాదాపు రెండునెలల ముందుగా బీజేపీ(BJP) అంజిరెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఖరారుచేయటం. పార్టీ తన అభ్యర్ధిత్వాన్ని ఖరారుచేయగానే వెంటనే అంజిరెడ్డి ప్రచారం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి వూటుకూరి నరేంద్రరెడ్డి మీద పార్టీలోనే నూరుశాతం యాక్సెప్టెన్సీ లేకపోవటం కూడా అంజిరెడ్డికి బాగా కలిసొచ్చింది. చివరినిముషంలో బీఎస్పీ(BSP) అభ్యర్ధిగా ప్రసన్న హరికృష్ణ పోటీలోకి దిగటం. ప్రసన్న పోటీలోకి దిగటం బీజేపీ అభ్యర్ధికి ఏ విధంగా కలిసొచ్చిందంటే బీసీ వాదాన్ని బలంగా తీసుకొచ్చారు. బీసీ(BC Slogan) నేతైన ప్రసన్న తనగెలుపుకు ఓటర్లలో చీలిక తీసుకురావటానికి శక్తివంచనలేకుండా ప్రయత్నించారు.

మొత్తం ఓటర్లలో బీసీ ఓటర్లను తనవైపుకు తిప్పుకుంటే గెలుపు సులభమని ప్రసన్న ప్లాన్ చేశారు. అయితే ప్రసన్న ప్లాన్ పూర్తిగా వర్కవుట్ కాలేదు. కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రరెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని నేతలు గెలుపుకు పనిచేయకపోవటం కూడా బీజేపీకి కలిసొచ్చింది. కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) లాంటి కొందరు నేతలు బీఎస్పీ అభ్యర్ధి గెలుపుకు బహిరంగంగా పనిచేయటంతో కాంగ్రెస్ పార్టీలోని ఓట్లు చీలిపోయాయి. కాంగ్రెస్ ఓట్లు కొన్ని నరేంద్రరెడ్డికి పోలవ్వగా మరికొన్ని ఓట్లు బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్నకు పడ్డాయి. దాంతో కాంగ్రెస్ ఓట్లలో చీలిక అంజిరెడ్డికి లాభించింది. అభ్యర్ధి అంజిరెడ్డా లేకపోతే మరొకరా అన్నది చూడకుండా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీ నేతలు, క్యాడర్ బీజేపీని గెలిపించటమే ఏకైక ధ్యేయంతో పనిచేయటం. ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చేముందే పై నాలుగు జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల ఓట్లను నమోదుచేయించటంలో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీలు బాగా కష్టపడ్డాయి.

అంజిరెడ్డితో సంబంధంలేకుండానే బీజేపీ గెలుపుకోసం కమిటెడ్ గా 24 గంటలూ కష్టపడే ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీ నేతలు, క్యాడర్ ఉండటం అంజిరెడ్డికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రరెడ్డి మీద ఓటర్లలో మొదటినుండి వ్యతిరేకత కనబడింది. నరేంద్రరెడ్డికి ఓట్లేయాలని అభ్యర్ధి తరపున ఓటర్లకు ఫోన్ చేసిన టెలికాలర్స్ కు ఓటర్లు రివర్సులో మాట్లాడుతున్నారనే ప్రచారం బాగా జరిగింది. తమ పిల్లలకు ఫీజులు తగ్గించమని అడుగుదామని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వని నరేంద్రరెడ్డికి ఇపుడు తామెందుకు ఓట్లేసి గెలిపించాలని కొందరు ఓటర్లు టెలికాలర్స్ ను నిలదీసినట్లుగా జరిగిన ప్రచారం బీజేపీ అభ్యర్ధికి కలిసొచ్చింది. నరేంద్రరెడ్డికి అల్పోర్స్ పేరుతో చాలా విద్యాసంస్ధలున్న విషయం అందరికీ తెలిసిందే.

అంజిరెడ్డి, నరేంద్రరెడ్డి మధ్యే పోటీ ఉంటుందని అందరు అనుకుంటున్న సమయంలో సడెన్ గా బీఎస్పీ అభ్యర్ధిగా ప్రసన్న హరికృష్ణ రంగంలోకి దిగారు. ప్రసన్నకు కూడా గ్రూప్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సెంటర్లున్నాయి. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావటంతో బీసీ ఓట్లను తనవైపుకు తిప్పుకోవటానికి ప్రసన్న చాలా ప్రయత్నాలు చేశారు. ప్రసన్నకు మద్దతుగా చాలా బీసీ సంఘాల్లోని నేతలు ప్రచారంచేశారు. కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు కొందరు సొంతపార్టీ నేతలు కూడా ప్రసన్నకు మద్దతుగా ప్రచారంచేశారు. దాంతో కాంగ్రెస్ ఓట్లలోనే కొన్ని నరేంద్రరెడ్డికి మరికొన్ని బీఎస్పీ అభ్యర్ధికి పడ్డాయి.

మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీసీల ఓట్లు ఎక్కువగా ఉండటమే కాకుండా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరవార్, ఏబీవీపీ నేతలు, క్యాడర్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్వయంగా బీసీ నేత కావటం కూడా అంజిరెడ్డికి బాగా కలిసొచ్చింది. పై నాలుగు జిల్లాలపరిధిలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎంఎల్ఏలున్నారు. మెదక్ ఎంపీ రఘునందనరావు, కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తో పాటు ఏడుగురు ఎంఎల్ఏలు పార్టీ గెలుపుకోసం బాగా కష్టపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్నట్లుగా తిరుగుబాట్లు, అలకల్లాంటివి బీజేపీలో లేకపోవటం అంజిరెడ్డికి బాగా కలిసొచ్చింది. ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపును బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పెద్ద సవాలుగా తీసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరేంద్రరెడ్డి అభ్యర్ధవటం కాంగ్రెస్ కు పెద్ద మైనస్ అయితే బీజేపీ అభ్యర్ధి అవటమే అంజిరెడ్డికి అతిపెద్ద ప్లస్ అయ్యింది.

Tags:    

Similar News