ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కావాలి.. బీజేపీ నిరసన

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ విపక్షాలు ఈరోజు అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టాయి.

Update: 2024-12-17 11:57 GMT

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ విపక్షాలు ఈరోజు అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేదని, ఆ ఆరు హామీల పేరిట ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారాయన. వీటిపై ప్రశ్నించిన ప్రతిసారీ కూడా కొలనులో చందమామను చూపిన తరహాలో అదిగో అమలుకు సిద్ధంగా ఉందని కబుర్లు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కావాలని కోరారు. ఇప్పటికే ఈ ఆరు గ్యారెంటీలను చట్టబద్దత కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏడో హామీ ఎటో కొట్టుకుపోయిందంటూ ఎద్దేవా చేశారు.

అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు

‘‘ఆరు గ్యారెంటీలు అమలు ఎప్పుడు అని అడిగే వాటికి బడ్జెట్ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్నారు. అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఎందుకు ఇచ్చారు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తారా. అంటే ప్రజలను మోసం చేయాలని అధికారంలోకి రాక ముందే ప్లాన్ చేసుకున్నారా. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆరు గ్యారెంటీలు అమలు చేయని ఈ సీఎం, డిప్యూటీ సీఎంలపై చీటింగ్ కేసు పెట్టాలి. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ హామీలపై వాయిదా తీర్మానం ఇస్తే స్పీకర్ తిరస్కరించారు. అసెంబ్లీ మాట్లాడనీయకుండా విపక్షాల గొంతును అధికార పక్షం నొక్కేస్తోంది. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల ముందు నోటికి వచ్చిన హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవి అమలుకు నోచుకోవని అప్పుడు తెలియదా? అని నిలదీశారు. తెలిసి కూడా ప్రజలను ఎలాగైనా మోసం చేయొచ్చనే ఇలాంటి దుస్సాహసానికి పాల్పడిందా? అని విమర్శించారు. తమ బతుకులు బాగుపడతాయన్న కోరికతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే.. వీళ్లు ఉన్నదాన్ని కూడా అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో బీజేపీ నేతలే కాక బీఆర్ఎస్ నేతలు కూడా నిరసన బాటపట్టారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు, రైతులు, అన్ని రంగాల వారు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విపక్షాల నిరసనల నడుమ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసేసింది.

Tags:    

Similar News