‘బీజేపీ నేతలమే అయినా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం’

రాష్ట్రం అభివృద్ధి చెందాలనే తాము కూడా కోరుకుంటామన్న ఈటల రాజేందర్.;

Update: 2025-08-23 11:56 GMT

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో శనివారం భేటీ అయ్యారు. డబుల్ బెడ్ రూప్ ఇళ్ల కేటాయింపు సహా పలు అంశాలపై వారు చర్చించుకున్నారు. అనంతరం ఈటల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీ ఎంపీలమే అయినా అనేక విషయాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, రాష్ట్రానికి రావాల్సిన వాటిని విడుదల చేయాలని కోరుతున్నామని చెప్పారు.

తాము కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం తప్పితే.. తమ ప్రభుత్వం లేదు కాబట్టి ప్రజలు అవస్థలు పడాలని అనుకోమని చెప్పారు. బీజేపీ.. రాజకీయాలకన్నా ప్రజల సంక్షేమం గురించే ఎప్పుడూ ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని తాము ఎప్పటికప్పుడు కోరుతున్నే ఉన్నామని కూడా ఈటల వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలనే తాము కూడా కోరుకుంటామని తెలిపారు.

‘‘రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలి. అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేయడం, నిందలు మోపడం సరికాదు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో మమ్మల్ని సంప్రదించలేదు. మా దృష్టికి వచ్చిన పేదల జాబితాను మంత్రికి అందించాం. ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణం రూ.5 లక్షలతో పూర్తయ్యే పరిస్థితి లేదు. కనీసం రూ.12 లక్షలయినా ఇంటి నిర్మాణం కోసం కావాలి. ఆ మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. నిర్మాణం పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడం సరికాదు. వాటిలో దొంగలు పడుతున్నారు’’ అని వివరించారాయన.

‘‘డబుల్ బెడ్ రూమ్ ఇల్లు విసిరి వేసినట్టు ఎక్కడో దూరంగా ఉన్నాయి. కేటాయింపులు సరిగా జరగలేదు. కరెంటు సౌకర్యం, రోడ్ల సౌకర్యం, డ్రైనేజీలు, లిఫ్ట్లు సరిగా లేవు. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాస ఉండటం కష్టంగా ఉంది. రెండు నెలల్లో పరిష్కారం చూపించాలని కోరడం జరిగింది. ఎవరికైతే కేటాయించారో వారిని మాత్రమే ఉండేలా చూడాలి. కొత్తగా ఇల్లు కేటాయింపులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు’’ అని గుర్తు చేశారు.

‘‘నిజంగా పేదరికంలో ఉండి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇల్లు లేని వారికి పేదవారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి తప్ప పైరవీలకు చోటివ్వవద్దని కోరాను. పారదర్శకత పాటించాలని కోరాము. బస్తీలలో నివసించే వారికి అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తే వారికి జీవనోపాధి సమస్య ఉండదు. కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, ఇళ్లల్లో పనిచేసే బ్రతికే వారికి అక్కడే ఇల్లు కట్టిస్తే లైవ్లీహుడ్ దెబ్బతినకుండా ఉంటుందనీ కోరాను, దీనికి మంత్రిగారు సుముకత వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం లో కట్టిన ఇళ్లను కేటాయించకపోవడం వల్ల దర్వాజాలు కిటికీలు పీక్కుని పోతున్నారు.. కావాల్సిన మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించి పేదవారికి ఇళ్లను కేటాయించాలని కోరాను’’ అని తెలిపారు.

‘‘సిమెంట్ ధర, ఇనుము ధర, ఇసుక ధర, మేస్త్రీల ధర పెరిగింది ఐదు లక్షల రూపాయల్లో ఇల్లు కట్టడం సాధ్యం కాదు. కొన్ని నిబంధనలు సడలించి ఇల్లు కట్టుకునే వారికి సాయం అందించాలి. జవహర్ నగర్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అవి ఆర్మీ భూములు. డంపు యార్డ్ వాసన పక్కన భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకునే వారు అందరూ పేదవారే, కానీ రెండు మూడు లక్షల రూపాయల లంచం ఇస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. రెవెన్యూ అధికారులు, బ్రోకర్లు కలిసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇల్లు కూలగొట్టిస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని పేదవాళ్లు కట్టుకునే ఇళ్లకు ఇబ్బంది పెట్టొద్దని మంత్రి దృష్టికి తీసుకు వచ్చాము’’ అని చెప్పారు.

‘‘మల్కాజిగిరి జిల్లా DRC మీటింగ్ సంవత్సరంనర అయినా జరగలేదు వెంటనే నిర్వహించాలని శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాము. నాలుగు లక్షల మెజారిటీతో నన్ను గెలిపించారు కాబట్టి బాధ్యతగా వారికోసం కష్టపడుతున్నాను. ప్రభుత్వం ఏదున్న ప్రజల సమస్యలను తీర్చాలి. ప్రజా సమస్యల పరిష్కారం జరిగే వరకు నా ప్రయత్నం కొనసాగుతుంది’’ అని వివరించారు.

Tags:    

Similar News