సీమాంధ్రులు చల్లగా చూస్తారా ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కే చంద్రశేఖరరావు ఆశలు నెరవేరుతాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ కేసీయార్ ఆశలు నెరవేరటం ఏమిటని అనుకుంటున్నారా ?

Update: 2024-04-07 13:37 GMT
KCR (source Facebook)

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కే చంద్రశేఖరరావు ఆశలు నెరవేరుతాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ కేసీయార్ ఆశలు ఏమిటి ? నెరవేరటం ఏమిటి ? అని అనుకుంటున్నారా ? పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గౌరవప్రదమైన సీట్లు గెలుచుకోవాలంటే అందుకు సీమాంధ్ర ఓటర్లు సహకరించాల్సిందే. సీమాంధ్రులు గనుక చల్లటిచూపు చూడకపోతే బీఆర్ఎస్ పైన దెబ్బపడిపోవటం ఖాయం. ఎలాగంటే తెలంగాణాలోని సుమారు 4 కోట్లమంది ఓటర్లలో సీమాంధ్రుల ఓటర్లు దాదాపు కోటిమందుంటారు. ఈ కోటిమంది కూడా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ పరిధి అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ, నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాలు వస్తాయి.

సుమారు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్లే పార్టీల గెలుపోటములను శాసిస్తాయనటంలో సందేహంలేదు. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీమాంధ్రుల ఓట్ల ప్రభావం స్పష్టంగా బయటపడింది. కాకపోతే సీమాంధ్రుల ఓట్లు రెండుగా చీలిపోయాయి. ఎలాగంటే గ్రేటర్ పరిధిలోని మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా పోలయ్యాయి. అలాగే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ కు పడ్డాయి. అలాగే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చెప్పుకోదగ్గస్ధాయిలో కాంగ్రెస్ కు మద్దతుగా పోలయ్యాయి. ఈ కారణంగానే బీఆర్ఎస్ కు వచ్చిన 39 సీట్లలో ఎక్కువగా గ్రేటర్ పరిధి, ఆనుకుని ఉన్న జిల్లాల్లోనే వచ్చాయి.

కాంగ్రెస్ స్వీప్

ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ దాదాపు స్వీప్ చేసేసింది. ఈ జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 34 సీట్లొచ్చాయి. పోయిన ఎన్నికల్లో పోటీచేయకుండా పరోక్షంగా సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్ కు ఓట్లు వేసేట్లుగా టీడీపీ ప్రయత్నించిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. మరి రాబోయే ఎన్నికల్లో పోటీ విషయమై చంద్రబాబునాయుడు స్టాండ్ ఏమిటనే విషయమై ఇంతవరకు బయటపడలేదు. అయితే సీమాంధ్రుల్లోని కొందరి ఆలోచనల ప్రకారం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్లు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోతాయి. సీమాంధ్రుల ఓట్లు బీఆర్ఎస్ కు పడేది చాలా తక్కువనే అంటున్నారు.

ఎందుకంటే రెండు ఎన్నికల్లో వరుసగా సీమాంధ్రులు బీఆర్ఎస్ కు ఓట్లేశారంటే రకరకాల కారణాలున్నాయి. కూకట్ పల్లిలో నివాసముంటున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి మాట్లాడుతు మొదటి ఎన్నికలో బీఆర్ఎస్ కు ఓట్లేయటానికి కారణం వేయకపోతే దాడులు జరుగుతాయన్న బయమే అన్నారు. రెండోసారి ఓట్లు ఎందుకు వేశారంటే మంచిగా పాలిస్తున్నారనే అభిప్రాయం ఉందట. కేసీయార్ పాలనలో సీమాంధ్రులపైన దాడులు జరగటం, గొడవలు జరగలేదు కాబట్టే ఓట్లేసినట్లు చెప్పారు. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల గురించి అడిగితే సమాధానం చెప్పకుండా దాటేశారు. ఇద్దరు, ముగ్గురితో మాట్లాడినా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లేసే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

పోటీ కాంగ్రెస్-బీజేపీ మధ్యే

ఇదే విషయమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. సీమాంధ్ర ఓట్లు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోతాయని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ బలహీనపడిన కారణంగా సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేసే విషయమై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్రకు చెందిన వాళ్ళు తమ వ్యాపారాలు, ఆస్తులు, ప్రాణాలకు రక్షణ ఇవ్వగలిగే పార్టీలకే ఓట్లేస్తారని అన్నారు. గడచిన రెండు ఎన్నికల్లో తమకు రక్షణ కల్సిస్తుందన్న ఉద్దేశ్యంతోనే బీఆర్ఎస్ కు ఓట్లేసిన విషయాన్ని గుర్తుచేశారు. లోకల్ కారణాలతో కాంగ్రెస్ కు, దేశంలో రెండో రాజధాని హైదరాబాద్ అయితే బాగుంటుందనే ఆలోచనతో బీజేపీకి ఓట్లేసే అవకాశాలున్నాయని అంచనా వేశారు.

వాళ్ళ మాటలను బట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అయితే కాంగ్రెస్ కు లేకపోతే బీజేపీకి పడతాయని. కాంగ్రెస్ అంటే అనుముల రేవంత్ రెడ్డి పాలనపై సానుకూలంగానే ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే నరేంద్రమోడి ఇమేజి, అయోధ్య రామాలయం నిర్మాణం ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి. అందుకనే రాబోయే ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లు బీఆర్ఎస్ కు పడేది అనుమానంగానే ఉంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News