బీజేపీ కొత్త అధ్యక్షుడికి కవిత లేఖ..

బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరిన కవిత.;

Update: 2025-07-02 06:16 GMT

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు ఆయన మద్దతు కోరారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ఆమె రామచందర్ రావుకు లేఖ రాశారు. ‘‘తరతరాలుగా సమాజ నిర్మాణంలో నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైనది. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. అందులో తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాము’’ అని తెలిపారు.

 

‘‘బీసీ సమాజం ఉద్యమాలకు దిగివచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ, శాసన మండలిలో రెండు వేర్వురు బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లులు పంపించి చాలా కాలం గడుస్తున్నప్పటికీ ఇంకా ఆమోదముద్ర పడలేదు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మీపైనే ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు చట్టరూపం తెచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. తద్వారా బీసీ సమాజానికి మీ పార్టీ సానుకూలమని స్పష్టతనివ్వాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News