కలలో కూడా ఇంతటి బంపర్ ఆఫర్ ను కేసీఆర్ ఊహించుండరు
ఈవిషయంలో బాగా అనుభవం ఉన్నది కాబట్టే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్(KCR) అసలు సమావేశాలకే హాజరవటంలేదు;
ఇలాంటి బంపర్ ఆఫర్ వస్తుందని అందులోను బద్దవిరోధి ఎనుముల రేవంత్ రెడ్డి నుండి వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలలో కూడా ఊహించుండరు. అసెంబ్లీ సమావేశాలు అంటేనే బలప్రదర్శనకు వేదికగా మారిపోయిన రోజులివి. ప్రజాసమస్యలు చర్చించి, పరిష్కారం కనుక్కునే వేదికగా అసెంబ్లీ సమావేశాలు ఒకపుడు జరిగేవి. కాని ఇపుడు మాత్రం అధికార, ప్రతిపక్ష సభ్యుల బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. ప్రజాసమస్యలపై సభలో జరుగుతున్న చర్చల సమయం చాలా తక్కువనే చెప్పాలి. అధికారపార్టీ సభ్యుల దృష్టంతా ప్రతిపక్షాల నోళ్ళు మూయించటంపైనే ఎక్కువగా ఉంటుంది. ఈవిషయంలో బాగా అనుభవం ఉన్నది కాబట్టే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్(KCR) అసలు సమావేశాలకే హాజరవటంలేదు. ఇలాంటి నేపధ్యంలో రేవంత్ రెడ్డి(Revanth) నుండి కేసీఆర్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది.
ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే జలవివాదాలు, కాళేశ్వరం, మేడిగడ్డ, రైతుల సమస్యలు, ఉద్యోగాల భర్తీ లాంటి అనేక సమస్యలపై కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఆచరణ సాధ్యమైన సూచనలు చేయాలన్నారు. కేసీఆర్ సభలో మాట్లాడేటపుడు తమవైపు నుండి ఎవరూ జోక్యంచేసుకోకుండా, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, ప్రసంగానికి అడ్డుపడకుండా చూసుకునే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్ మాటిచ్చాడు. ప్రధానప్రతిపక్ష నేతకు ఇంతకన్నా మంచి ఆఫర్ ఎవరిస్తారు ? ఇక్కడతో రేవంత్ ఆగకుండా కేసీఆర్ కు సమావేశాలకు ఎప్పుడు రావాలనిపిస్తుందో ఆ తేదీలనే స్పీకర్ కు లేఖ ద్వారా తెలియచేయాలని చెప్పాడు. ఈ ముచ్చట దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా జరుగుతుందా ? జరిగినట్లు మనం విన్నామా ?
అసెంబ్లీసమవేశాలు ముఖ్యమంత్రి ఎప్పుడు అనుకుంటె అప్పుడు, ఎన్నిరోజులు అనుకుంటే అన్నిరోజులే జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోను ఇదే పద్దతి. మరి రివాజుకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరపాలి ? ఎన్నిరోజులు జరగాలన్న నిర్ణయం కేసీఆర్ చేతిలో పెట్టారు రేవంత్. ఇంతకన్నా ఆఫర్ కేసీఆర్ కు దొరుకుతుందా ? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు రేవంత్ కు నోరెత్తటానికి కూడా కేసీఆర్ అవకాశం ఇవ్వలేదన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రేవంత్ ను ఎన్నిసార్లు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసింది కేసీఆర్ కు బాగానే గుర్తుండి ఉంటుంది. అలాంటిది ఇపుడు ఉల్టాగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలో, ఎన్నిరోజులు నిర్వహించాలో కేసీఆర్ నే చెప్పమని రేవంత్ అడిగాడు. పైగా కేసీఆర్ మాట్లాడేటపుడు సభలో తమవైపు నుండి ఎలాంటి అంతరాయంలేకుండా చూసుకునే బాధ్యతను తానే తీసుకుంటాననే హామీని కూడా ఇచ్చాడు. ఇంతకన్నా మించిన ఆఫర్ కేసీఆర్ కు భవిష్యత్తులో రాదుకాకరాదు. అసలు ఇలాంటి ఆఫర్ రేవంత్ నుండి వస్తుందని కేసీఆర్ కలలో కూడా ఊహించుండరు. ఒకవేళ అసెంబ్లీకి రావటానికి కేసీఆర్ కు ఆరోగ్యం సహకరించకపోతే మంత్రులతో కలిసి తానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వస్తానని రేవంత్ ఇచ్చిన బంపర్ ఆఫర్ హైలైట్ అని చెప్పాలి.