కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ఏడుగురి మృతి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది.కారు అదుపు తప్పి కాల్వలోకి పడిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-10-16 14:01 GMT

మెదక్ జిల్లా తుప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత ఆలయానికి కారులో వెళ్లి వస్తుండగా బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గుంతల వల్ల కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని పక్కనే ఉన్న కాల్వలో పడింది. ఈ ఘటనలో కారుల్లో ఉన్న ఏడుగురు నీట మునిగి అక్కడికక్కడే మరణించారు. మృతులు పాముబండ తండాకు చెందిన వారని, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. కారు డ్రైవింగ్ చేస్తున్న నామ్ సింగ్ కు తీవ్ర గాయాలవడంతో అతన్ని తుప్రాన్ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో నామ్ సింగ్ భార్య శాంతి (38), అతని కుమార్తె మమత(12), సీతారాం తండాకు చెందిన అనిత (35), శ్రావణి (12), తలపల్లితండాకు చెందిన శివరాం(56) దుర్గి (45) హిందూ (13) మృత్యువాత పడ్డారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి
మెదక్ జిల్లా శివంపేట మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సీఎం వెంటనే అధికారుల తో మాట్లాడి జరిగిన ప్రమాదం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ డ్రైవరుకు మెరుగైన వైద్య చికిత్స తో పాటు, అవసరమైన సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

క్షతగాత్రుడికి వైద్యం అందించాలని మంత్రి ఆదేశం
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పాముబండ తండాకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతినీ తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి చెప్పారు.


Tags:    

Similar News