‘తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది’
ఏపీకి కొత్త ప్రాజెక్ట్‌లు.. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపుతుందన్న మంత్రి శ్రీధర్ బాబు.;
తెలంగాణ విషయంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. అన్ని విషయాల్లో తెలంగాణ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని, ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల కేటాయింపుల్లో అన్యాయం చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు కేటాయిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం అన్ని విషయాల్లో మొండి చేయి చూపుతుందని విమర్శలు గుప్పించారు. అన్ని అంశాల్లో తెలంగాణను ఉద్దేశపూర్వకంగానే పక్కనబెడుతోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న తమ తపనపై కేంద్రం కావాలని నిళ్లు చల్లుతోందని అన్నారు. ప్రపంచస్థాయి అధునాతన ప్యాకేజింగ్ కంపెనీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, కానీ కేంద్రం నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదని వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేశ్వరంలో 10 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, రాయితీలు ఇవ్వడానికి కూడా ఆమోదించి రికార్డ్ స్థాయిలో అనుమతులు పూర్తి చేశామని, కానీ కేంద్ర క్యాబినెట్ మాత్రం ససేమిరా అని చెప్పేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ ఏపీ విషయంలో మాత్రం ఎక్కడలేని ప్రేమ కనబరుస్తోందని విమర్శించారు. ఏపీ నుంచి ఎటువంటి ప్రాజెక్ట్ ప్రతిపాదన వచ్చినా కేంద్రం వెంటనే ఆమోద ముద్ర వేసేస్తోందని అన్నారు. కానీ తెలంగాణ నుంచి వెళ్లే ప్రతిపాదనలు, భూకేటాయింపులు అన్నీ కూడా కాగితాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కేంద్రం ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటుందని ప్రశ్నించారు. కేంద్రం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు.