‘తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్’
బీహార్ చేపట్టిన కుల గణనను కోర్టు తప్పుపట్టడంతో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ రాష్ట్రం చేపట్టిన కుల గణన అశాస్త్రీయం అని చెప్పారు... తెలంగాణది కాదు.. అని రేవంత్ వివరించారు.;
కులగణన విషయంలో తెలంగాణ.. దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తొలిసారి కులగణను విజయవంతంగా చేపట్టిన రాష్ట్రం తెలంగాణ అని, ఇప్పుడు ఇదే మోడల్‌ను బ్లూప్లింట్‌గా తీసుకుని కేంద్రం కూడా కులగణన, జనగణన కలిపి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. ఇన్నాళ్లూ కులగణను వ్యతిరేకించిన కేంద్రం.. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర మోడల్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుందని చెప్పారు. 2011లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కులగణన చేసినా.. ఆ రిపోర్ట్‌ను విడుదల చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టపడలేదని అన్నారు.
‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు.. నాడు ప్రజల మనస్సులోని మాటను గ్రహించి కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని మా ప్రభుత్వం కుల గణన చేపట్టింది. కుల గణనపై శాసనసభలో తీర్మానం చేశాం... తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్లే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రోడ్లపై మొదలు జంతర్ మంతర్ వరకు.. అక్కడి నుంచి పార్లమెంట్ వరకు ఆందోళనలు చేశాం... మా గళం వినిపించాం’’ అని తెలిపారు.
‘‘కుల గణన చేపట్టాలని మేం జంతర్‌మంతర్ లో చేసిన ఆందోళనకు బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. మా డిమాండ్ మేరకు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనతో వచ్చిన ఒత్తిడి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కుల గణనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వందేళ్లుగా ఎవరూ చేయని కుల గణన తెలంగాణలో మా ప్రభుత్వం చేపట్టడంతో ఇప్పుడు కేంద్రం ఆ మార్గంలోకి వచ్చింది. కుల గణనలో తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్. తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు మంత్రుల కమిటీని, నిపుణుల కమిటీని నియమించాం. మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీ జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రజల డిమాండ్లను విన్నది’’ అని చెప్పారు.
‘‘ముఖ్యమంత్రిగా ఉన్న నేను కుల గణన ప్రక్రియపై 8 సార్లు స్వయంగా సమీక్ష నిర్వహించాను. కుల గణనను పారదర్శకంగా... ఎటువంటి లోటపాట్లకు తావు లేకుండా నిర్వహించాం. 90 వేలకుపైగా ఎన్యుమరేటర్ల ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించారు. ప్రతి పది ఎన్యుమరేటర్లపై ఒక సూపర్‌వైజర్ ను నియమించాం. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాం. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడానికి అనేక సవాళ్లు ఉన్నాయి.. ఉదాహారణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీసీలు ఉన్న బోయలు కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారు.. తెలంగాణలో ఎస్టీలుగా ఉన్న లంబాడాలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు.. ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ సమస్యలు ఉన్నాయి’’ అని అన్నారు.
‘‘కుల గణన చేపట్టేందుకు మంచి కసరత్తు చేయాలి.. కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలి... నిపుణుల కమిటీని నియమించాలి. దేశవ్యాప్త కుల గణనకు విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రిపరెన్సెస్) రూపొందించాలి. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అనుభవాన్నికేంద్రం వినియోగించాలి. మేం కుల గణన చేపట్టిన తీరు... ఇతర అంశాలపై మా దగ్గర ఉన్న సమాచారాన్నిపంచుకోవడానికి మేం సిద్దంగా ఉన్నాం. దేశ ప్రజల ప్రయోజనాల విషయంలో మేం రాజకీయాలకు పాల్పడదల్చుకోలేదు. కుల గణనను సమాజ ఎక్స్‌రేగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.... ఎక్స్‌రేను చూసిన తర్వాతే చికిత్స చేయగలం. కుల గణన దేశానికి ఎక్స్ రే లాంటిది... దాని నుంచి వచ్చే వివరాల ఆధారంగా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని సూచించారు.
‘‘కుల గణన విషయంలో మాకు మార్గదర్శకంగా నిలిచిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు 400 సీట్లు ఇవ్వకపోవడం.... కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే ఇప్పుడు కేంద్రం కులగణనకు అంగీకరించింది. కుల గణనకు కేంద్రం అంగీకరించడం రాహుల్ గాంధీ, ఆయన చేసిన జోడో యాత్ర ఫలితం. బీహార్ చేపట్టిన కుల గణనను కోర్టు తప్పుపట్టడంతో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ రాష్ట్రం చేపట్టిన కుల గణన అశాస్త్రీయం అని చెప్పారు... తెలంగాణది కాదు.. మొన్నటి వరకు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడింది. మా ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ముందుకు వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.