గురువారం నాడు రైతు రుణ మాఫీ పైసలు జమ షురూ

రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-07-16 14:35 GMT

రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు తెలిపారు. మంగళవారం సచివాలయం లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సదస్సులో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు. 

ఈ నెల 18 న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆరోజు సాయంత్రం లోగా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు జరుపుతామన్నారు. ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ హెచ్చరించారు. 

రేషన్ కార్డు నిబంధన వివాదం..

సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. రుణమాఫీ అమలు విధివిధానాలు వివరిస్తూ జీవో ఆర్టీ నెంబర్ 567 ని జారీ చేసింది. అందులో ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు పేర్కొంది. అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన, రెన్యువలైన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీ కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే, రైతు కుటుంబాన్ని గుర్తించడానికి ఆహార భద్రత కార్డు (తెల్ల రేషన్ కార్డు)ను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిపింది. దీంతో వివాదం తలెత్తింది. "రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, పాస్ బుక్ ఆధారంగా పంటరుణమాఫీ ఉంటుందని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికం అని మార్గదర్శకాల్లో పెట్టడమేంటని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి". రైతుల్లోనూ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు కలెక్టర్ల సమావేశంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం క్లారిటీ ఇచ్చారు. పాస్ బుక్ ప్రామాణికంగా రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టతనిచ్చారు. దీంతో రేషన్ కార్డు వివాదానికి తెరపడింది. 



 

Tags:    

Similar News