మా బంధువుల నిర్మాణాలను నేనే కూల్చివేయిస్తా -సీఎం

హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Update: 2024-08-28 09:37 GMT

హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం ఉదయం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ భూమి పూజలో పాల్గొన్న ఆయన... మధ్యాహ్నం మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యం.. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం.. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్, పార్కులు, నాలాల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యమని సీఎం వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. జంట జలాశయాలను పరిరక్షించడమే మా భాద్యతన్న సీఎం.. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో నా కుటుంబ సభ్యులు, బంధువులు ఉంటే వివరాలు ఇవ్వండి.. నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివేస్తా అని ప్రకటించారు. ఒవైసీ కాలేజీ విషయంలో విద్యాసంవత్సరం నష్టపోతుందని సమయం ఇచ్చామన్నారు. విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం కాబట్టి ఆలోచిస్తున్నామని సీఎం తెలిపారు.

ఫార్మ్ హౌస్ లు కట్టుకున్న సెలెబ్రిటీలు మురికి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోకి వదులుతున్నారు.నిబంధనలు అతిక్రమించి ఫామ్‌హౌస్‌లు కడితే ఎలా? అందుకే కూల్చివేస్తున్నామని సీఎం తెలిపారు. ఇక జన్వాడ కేటీఆర్ ఫార్మ్ హౌస్ వ్యవహారంపై స్పందించిన ఆయన... కేటీఆర్ ఫార్మ్ హౌస్ లీజుకి తీసుకున్నానని చెబుతున్నాడు, ఆ లీజు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు మెన్షన్ చేయలేదని ప్రశ్నించారు. నిజానికి ఈ విషయంలో కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలని సీఎం అన్నారు. పార్టీలకతీతంగా హైడ్రా కూల్చివేతలు చేస్తోందని చెప్పిన ఆయన... ముందుగా కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్నే కూల్చివేశామని గుర్తు చేశారు. అసలు జన్వాడ ఫార్మ్ హౌస్ కి గ్రామా పంచాయతీ అనుమతులు లేవని సీఎం తెలిపారు. ఎఫ్టీఎల్ అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ జరుగుతుందని చెప్పారు. హైడ్రాకి పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా ఇస్తామని తెలిపారు. 

Tags:    

Similar News