ఫామ్‌హౌస్‌లు నిలుపుకోవడానికే మూసీవాసులకు మద్దతు: రేవంత్

మూసీ నిర్వాసితులపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి పెదవి విప్పారు. వారిని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Update: 2024-10-05 14:10 GMT

మూసీ నిర్వాసితులపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి పెదవి విప్పారు. వారిని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొందరు కపట మూసీ నిర్వాసితులపై కపట ప్రేమ కనబరుస్తున్నారని, తమ ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికి మూసీ నిర్వాసితులను అడ్డుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు చెప్తున్నవన్నీ అబద్దాలేనని, పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయదని పునరుద్ఘాటించారు. ప్రతి మూసీ నిర్వాసితునికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, బఫర్‌జోన్‌లో ఇల్లు ఉన్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం కల్పిస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, పేదలే టార్గెట్‌గా హైడ్రాను ఉసిగొల్పుతుందంటూ ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్న పెద్ద మనుషులు ప్రత్యామ్నాయం చెప్పమంటూ గప్‌చుట్ అని ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలంటే చెరువులు కళకళాడుతూ ఉండాలని, ఆ కలను నెరవేర్చడం కోసమే ఈరోజు ఈ చర్యలు చేపడుతున్నామని వివరించారు సీఎం. ఈ ఎండా కాలం బెంగళూరులో గుక్కెడు నీళ్లు దొరక్క అందరూ అల్లాడిపోయారని, వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న ట్యాంకర్లు కూడా అందలేదని గుర్తు చేశారు. బెంగళూరుకు పట్టిన గతి రానున్న కాలంలో హైదరాబాద్‌కు కూడా పట్టకూడదంటే చెరువులు, నాలాలను కాపాడుకోవాలని అన్నారు.

రూ.10 వేల కోట్లు ఖర్చుకు రెడీ..

చెరువులు, కుంటలు, నాలాలు కనుమరుగైతే నీరు దొరకదని, అదే విధంగా వరదలు వస్తే నగరమే అతలాకుతలం అవుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. అలాంటి విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మూసీ నిర్వాసితులు ఎవరూ భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరం అయితే మూసీ నిర్వాసితుల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అతి త్వరలోనే మూసీ నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.

ప్రభుత్వం ప్రజలను అనాథలను చేయదు

‘‘మూసీ నిర్వాసితులకు నాదొక్కటే విజ్ఞప్తి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మీకు సేవ చేయడానికి, మంచి జీవనం అందించడానికి కట్టుబడి ఉంటుంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లో అనాథల్ని చేయదు. మీకు ప్రత్యామ్నాయం చూపించే బాధ్యత ప్రభుత్వానిది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. కొందరు కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పుతున్నారు. తమ వాక్చాతుర్యంతో రెచ్చగొట్టే మాటలు చెప్పి అమాయక ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ప్రజలు ఎవరి మాటలు నమ్మొద్దు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలా గుడ్డిగా ముందుకు వెళ్లడం లేదు. పక్కా ప్రణాళిక, స్పష్టమైన విధానంతోనే ముందడుగు వేస్తోంది. రాష్ట్రాన్ని నిజమైన అభివృద్ధి పథంలోకి నడిపిస్తోంది. పేదల మంచి కోసమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆలోచన చేస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు సీఎం.

ఎవరిపైనా కోపం లేదు

‘‘ప్రజలకు మేటు చేయడమే మా ప్రభుత్వం ముందున్న లక్ష్యం. దాన్ని సాధించడానికే మేము రాత్రింబవళ్లు శ్రమిస్తున్నది కూడా. ప్రజలకు సుభిక్ష పాలన అందించడమే మా అజెండా. మాకు ఎవరిపైనా కోపం లేదు. సమర్మతీ నదిని నరేంద్ర మోదీ అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి స్వాగతించారు. అదే విధంగా ఇప్పుడు మూసీని కూడా మరో సబర్మతిలా చేయాలని ఈ ప్రభుత్వం సంకల్పించింది. అందులో తప్పేంటి. కేసీఆర్, కేటీఆర్‌కు నిజంగా పేదలపైన, పేదలన్నా ప్రేమ ఉంటే వారివారి ఫామ్‌హౌస్‌లో కొంత భూమిని పేదలకు దానం ఇవ్వాలని కోరుతున్నా. మీరు ఫామ్ హౌస్‌లలో జమిందార్లలా బతికితే పేదలు మూసీ ముంపులో బతకాలా? అవసరమైతే మలక్‌పేట్ రేస్ కోర్సును, అంబర్ పేట్ పోలీస్ అకాడమీని సిటీ బయటకు పంపయినా పేదలను ఇళ్లు కట్టిస్తాం’’ అని చెప్పారు.

అనుభవంతో సలహా ఇవ్వండి

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘మీ ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. మీ అనుభవంతో పేదల కోసం ఏం చేద్దామో చెప్పండి హరీష్, ఈటెల. అంతేకానీ ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు. పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18వేల కోట్ల రుణమాఫీ చేసింది. దయచేసి రైతులు ఎవరూ ఆందోళన బాట పట్టొద్దు. ఆందోళన చెందవద్దు. మీకు ఇస్తామన్న ప్రతి రూపాయిని మీకు అందేలా చూసే బాధ్యత నాది. సమస్య ఉంటే మీరు మీ కలెక్టర్‌ను కలవండి. వారు మీ సమస్యలను పరిష్కరించడానికి దోహదపడతారు’’ అని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News