ధరణి పోర్టల్ వెనక ఇంత కథ ఉందా..!

తెలంగాణలో ఉన్న భూ సమస్యలన్నింటికీ ధరణి పోర్టలే కారణం. అసలు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే భూవివాదాలు పెరిగాయి.

Update: 2024-12-20 10:33 GMT

తెలంగాణలో ఉన్న భూ సమస్యలన్నింటికీ ధరణి పోర్టలే కారణం. అసలు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే భూవివాదాలు పెరిగాయి. ధరణి పోర్టల్ తర్వాత భూ సమస్యలను పరిష్కరించే అధికారాన్ని ఎవరికీ అప్పగించకపోవడంతో సమస్యలు కుప్పలు కుప్పలుగా మారిపోయాయి అని ఎంతో కాలం నుంచి చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలను పీడించడమే పరమావధిగా తీసుకొచ్చిన పథకమే ఈ ‘ధరణి’ అన్న వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దరణి సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రతి సమస్య కూడా భూమితోనే ముడిపడి ఉంటుందని ఉన్నారు. ‘భూ భారతి’ బిల్లు చర్చలో భాగంగా ‘ధరణి’ పోర్టల్‌పై సీఎం రేవంత్ ఘాటుగైన వ్యాఖ్యలు చేశారు. ‘ధరణి’ పేరుతో బీఆర్ఎస్ దగా చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా భావించే భూమినీ బీఆర్ఎస్ లాక్కునే ప్రయత్నాలు చేసిందని, ‘ధరణి’ వచ్చిన తర్వాతే అసలు భూ ఆక్రమణలు అధికమయ్యాయని, ‘ధరణి’ నిర్వహణకు గాలికొదిలేశారని ఆరోపించారు. అసలు ఈ పోర్టల్‌ను గత పాలకులు నేర చరిత్ర ఉన్న సంస్థలకు అప్పగించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

‘‘తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి. ఆ భూమిని కాపాడుకోవడం కోసం దొడ్డి కొమరయ్య వంటి వారు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది భూ పోరాటాలు చేశారు. పేదల భూములు కాపాడటం కోసం పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. భూమిలేని పేదలకు ఇందిరా గాంధీ.. ప్రభుత్వ భూమి ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడటం కోసం గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయి. అదే పేరుతో బీఆర్ఎస్ మాత్రం దగా చేయడానికే ‘ధరణి’ పోర్టల్ తెచ్చింది. ‘ధరణి’ రైతులకు తమ భూములకు దూరం చేసింది’’ అని రేవంత్ మండిపడ్డారు.

‘‘2010లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరణి విధానాన్ని అనుసరించింది. అప్పుడు ఒడిశా ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్ఐసీ, కాగ్ సూచించాయి. అనుభవం లేని ఐ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థకు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించొద్దని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజు కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న సంస్థలను ఐఎల్ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థ టేకోవర్ చేసుకుంది. అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతను అప్పగించారు’’ అని చెప్పారు రేవంత్.

‘‘ధరణి టెండర్ దక్కిన వెంటనే ఈ సంస్థ పేరు, యాజమాన్యం మారింది. ఫాల్కన్ హెచ్‌బీ అనే ఫిలిప్పీన్ సంస్థ, సింగపూర్‌కు చెందిన మరో కంపెనీ ఇందులోకి ఎంట్రీ ఇచ్చాయి. 50 లక్షల మంది రైతులు, వారి భూముల వివరాలను ఈ సంస్థ చేతిలో పెట్టారు. ట్యాక్స్ హెవెన్ దేశా కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్‌ను పెట్టారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జీన్ ఐలాండ్ మీదుగా ధరణి పోర్టల్ తిరిగింది. పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా.. సీఈవోగా గాదె శ్రీధర్‌రాజే ఉన్నారు’’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News