మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు: రేవంత్
భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉండకూదన్న ఉద్దేశంతోనే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశానని వివరించారు.;
ఎస్సీ వర్గీకరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం తమ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ‘రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదు’ అని తెలిపారు. భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉండకూదన్న ఉద్దేశంతోనే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశానని వివరించారు. ఆ కమిషన్ 199 పేజీల నివేదికను అందించిందని తెలిపారు.
‘‘ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసింది కాదు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపాం. సుప్రీం కోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశాం. సుప్రీం కోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదు ’’ అని అన్నారు.
‘‘కానీ మేం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టాం. న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం.. ఇప్పుడు సాధించుకున్నాం. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ను నియమించాం. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీంని నియమించాం. ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చాం. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే… భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇదొక గొప్ప అవకాశం.. ఇది పది మందికి ఉపయోగపడేలా చూడాలి. కుర్చీలో మీ వాడిగా నేనున్నా… మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’’ అని వివరించారు.
‘‘ఎస్సీ వర్గాలను నేను సీఎంగా ఉన్నప్పుడే న్యాయం చేయాలని బలంగా నమ్మాను. అందుకే అసెంబ్లీలో అందరినీ కూడగటగ్టాం. బిల్లును వ్యతిరేకించే సాహసం కూడా ఎవరూ చేయలేదు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2 కు 9శాతం, గ్రూప్-3కి 5శాతం రిజర్వేషన్లు కల్పించాం. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్-1లో ఉంచాం’’ అని తెలిపారు.
‘‘ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత అసెంబ్లీలో నేనే చెప్పా. దానిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరా. అదే విధంగా తీర్మానం ప్రవేశపెడితే నన్ను, సండ్ర వెంకట వీరయ్య, సంపత్‌ను సభ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు మేం పెట్టిన తీర్మానాన్ని విధిలేకుండా ఆమోదించాల్సి వచ్చింది. మందృకృష్ణ మాదిగతో నాకెటువంటి విభేధాలు లేవు. కానీ ఆయన నాకన్నా మోదీ, కిషన్‌లనే ఎక్కువగా నమ్ముతారు’’ అని తెలిపారు.