'తెలంగాణకి రూ.5వేల కోట్లు నష్టం.. కేంద్రం రూ.2వేల కోట్లు ఇవ్వాలి'

రాజకీయాలకు ఇది సమయం కాదు. తక్షణమే రాష్ట్రానికి కేంద్రం రూ. 2 వేల కోట్లు కేటాయించాలి.

Update: 2024-09-02 12:01 GMT

రాజకీయాలకు ఇది సమయం కాదు. తక్షణమే రాష్ట్రానికి కేంద్రం రూ. 2 వేల కోట్లు కేటాయించాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లాలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన పంట ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వలన జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. అధికారులు సీఎంకి పంట, ఆస్తి నష్టం పైన ప్రాథమిక నివేదిక ఇచ్చారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో రూ. 5వేల కోట్లు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి, కేంద్రం వెంటనే రాష్ట్రానికి రూ. 2వేల కోట్లు కేటాయించాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. పశువులు చనిపోతే రూ. 50 వేలు, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఖమ్మం నల్గొండ పరిస్థితిని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాకి వివరించామని చెప్పారు. తక్షణ సాయంగా సూర్యాపేట కలెక్టర్ కి రూ 5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ల కు నిర్ణయాధికారం ఇచ్చినట్లు సీఎం స్పష్టం చేశారు.

బురద రాజకీయాలొద్దు...

వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్ లో ట్వీట్లు పెడుతున్నాడు, ఒకాయన ఫాంహౌస్ లో ఉన్నాడని.. కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి విమర్శించారు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కానీ, వరద బాధితులను పరామర్శించరని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.

మంత్రులంతా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని సీఎం వెల్లడించారు. మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్నానన్నారు. వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా మనమే ఎండీఆర్ఎఫ్ ను ప్రారంభించుకుంటున్నం అని చెప్పారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించాం. రాష్ట్రంలో రూ.ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు వస్తున్నాయని తెలిపారు. 

అనంతరం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు అలుగు వరద ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనతోపాటు పాలేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. 

Tags:    

Similar News