సమ్మె ఆలోచన వద్దు.. ఆర్టీసీ కార్మికులకు సీఎం విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి అని కోరారు.;

Update: 2025-05-01 10:20 GMT

మే 7 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అంతా సమ్మె ప్రారంభించనున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని, ఇలాంటి సమయంలో సమ్మె చేయొద్దని ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కాగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించారు. సమ్మె ఆలోచనను వీడాలని వారిని కోరారు. రవీంద్ర భారతి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై రేవంత్ స్పందించారు. ‘‘కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకం. తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే మీ సహకారం ఎంతో ఉంది. సింగరేణి లాభాలలోకార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కార్మికులకు మేలు చేయడమే మా ప్రభుత్వ విధానం’’ అని తెలిపారు.

‘‘అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. ఆర్టీసీలో సమ్మెపై చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా.. సమ్మె ఆలోచన వీడండి. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ…. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది. గత పదేళ్లలో విధ్వంసం జరిగింది. గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారు’’ అని చెప్పారు.

‘‘1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా. మేం అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో 8 లక్షల 29 వేల కోట్లు మా చేతికి అప్పు పెట్టి వెళ్లారు. రూ.లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలింది. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. ఈ 15 నెలలు నేను, నా సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు.. మీ కోసమే ఖర్చు చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

‘‘రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు… అందుకే ఒకసారి ఆలోచించండి. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది… ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు… వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. కెసిఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘అసెంబ్లీకి మీరు పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండి. కపటనాటక సూత్రధారి మళ్లీ బయలుదేరిండు… ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటా.. త్వరలో రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకురాబోతున్నాం. ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతోంది. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు’’ అని అన్నారు.

Tags:    

Similar News