ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్..
ఎవరైనా పార్టీలో ఉండాలంటే లిమిట్‌లో ఉండాలని, లైన్‌లో ఉండి నడుచుకోవాలని చెప్పారు రేవంత్.;
పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. లైన్ దాటుతున్న నేతల వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఎవరైనా పార్టీలో ఉండాలంటే లిమిట్‌లో ఉండాలని, లైన్‌లో ఉండి నడుచుకోవాలని చెప్పారు. కాదుకూడదు లిమిట్ క్రాస్ చేస్తాం.. లైన్ దాటుతాం అంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగానే పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక గ్రామాలను ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుందని చెప్పారు. అయితే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కొందరిని ఉద్దేశించే రేవంత్ ఈ వార్నింగ్ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా తీన్మార్ మల్లన్న, జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేస్తున్న పనులను చూసే సీఎం రేవంత్.. ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగిందని సమాచారం.
రెచ్చిపోతున్న నేతలు
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. పార్టీ నేతలతో తన నివాసంలో డిన్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆ సమావేశంలో పలు అంశాలపై చర్చించుకున్నారాని, పార్టీ మారాలన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా దానిపై స్పందించిన అనిరుధ్ రెడ్డి.. భేటీ జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఒకే పార్టీ నేతలం కలిసి భోజనం చేయడం తప్పా? అని పార్టీని ప్రశ్నించారు. పార్టీ నేతలం కలిసి భోజనం చేశామని, ప్రచారం జరుగుతున్నట్లు చర్చలు ఏం జరగలేదని అన్నారు. ‘‘ఎమ్మెల్ోయేలు భేటీ అయిన విషయం వాస్తవమే. మేము రహస్యంగా సమావేశం కాలేదు. అధిష్టానానికి చెప్పాల్సింది చాలానే ఉంది. నా క్యారెక్టర్‌ను తప్పుగా చూపిస్తే ఊరుకునేదే లేదు. ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలిసిందే. అన్ని ఆధారాలతో పెద్దలతో మాట్లాడతా’’ అని అనిరుధ్ వ్యాఖ్యానించారు.
కుల గణన అంతా తప్పే: మల్లన్న
మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెచ్చిపోయి మరీ.. ఈ కుల గణన అంతా తప్పుల తడక అని అన్నారు. అంతేకాకుండా కుల గణన రిపోర్ట్‌కు నిప్పంటించి.. ప్రతి బీసీ కూడా ఈ చెత్త కుల గణన రిపోర్ట్‌ను చించి చెత్తబుట్టలో వేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పలు సభల్లో పాల్గొని కూడా కులాల పేరుతో మల్లన్న రెచ్చిపోయి మాట్లాడారు. దీంతో వీరిద్దరి వ్యవహారాన్ని సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎల్పి సమావేశం నిర్వహించి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హద్దులు మీరితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ సహా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు.
సమస్యలు ఉంటే చెప్పాలి: సీఎం
సీఎల్పీ మీటింగ్‌లో అనిరుధ్ రెడ్డి నివాసంలో జరిగిన డిన్నర్ మీటింగ్ ప్రస్తావన వచ్చింది. దీంతో తాము డిన్నర్ కోసమే కలిశామని, ఎటువంటి రహ్యభేటీ కాదని సదరు ఎమ్మెల్యేలు విరవణ ఇచ్చారు. దీంతో అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ ఇన్‌ఛార్జ్, ఇన్‌ఛార్జ్ మంత్రి, సీఎం దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ సూచించారు. అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని, ఎవరైనా పార్టీ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని, ఎవరికీ దీని నుంచి మినహాయింపు లేదని సీఎం సీరియస్ అయ్యారు.
ఢిల్లీకి అందుకే వెళ్తున్నాం: మహేష్
ఐదు గంటల పాటు జరిగిన సీఎల్పీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాం. సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలు చెప్పారు. పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని తెలిపారు. పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నాం. పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించాం. రాష్ట్ర ఆదాయం, అప్పులు, వ్యయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. వాటికి అధిష్ఠానం నేతలను ఆహ్వానించడానికే ఢిల్లీకి వెళ్తున్నాం. ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవడం తప్పు కాదు’’ అని అన్నారు.