ఎస్సీ వర్గీకరణ.. ఏకసభ్య కమిషన్ కాలపరిమితి పెంపు

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అందించిన నివేదికపై పలు అభ్యంతరాలు వ్యక్తమవడే ఇందుకు కారణం.;

Update: 2025-02-18 12:07 GMT

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ వర్గకరణ కోసం జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ కమిషన్ కాలపరిమితి పెంచింది. ఏకసభ్య కమిషన్‌గా షమీమ్.. నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. సమగ్ర అధ్యయనం చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ అరవై రోజుల గడువు జనవరి 10తో ముగిసింది. దీంతో ఫిబ్రవరి 10 వరకు ఈ కమిషన్ కాలపరిమితి పొడిగించింది ఈ ప్రభుత్వం. తాజాగా ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని మరోసారి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అయితే ఎస్సీ వర్గీకరణ నివేదికను కమిషన్ అందించినప్పటి నుంచి దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇందులో అనేక లోటుపాట్లు ఉన్నాయని, దీనిని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరుతున్నవారు కూడా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రశ్నిస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇటీవల ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఈ నివేదికలో పలు మార్పులను ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ కమిషన్ కాలపరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అనుకున్న విధంగా నివేదికను పునఃపరిశీలించడానికి, పలు మార్పులు చేయడంపై అభిప్రాయాలు స్వీకరించడం కోసం కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పెంచింది ప్రభుత్వం.

ఎస్సీ వర్గీకరణ నివేదికలో ఏముందంటే..

ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. నివేదిక ప్రకారం.. ఎస్సీలలో 59ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. వీటితో గ్రూప్-1లో 15 ఉపకులాలకు ఒకశాతం రిజర్వేషన్ (15ఉపకులాల జనాభా 3.288శాతం), గ్రూప్-2లో 18 ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్(18 ఉపకులాల జనాభా 62.748శాతం), గ్రూప్-3లో 26 ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్ (26 ఉపకులాల జనాభా 33.963శాతం) కల్పించాలని పేర్కొంది. కాగా ఇటీవల సీఎం రేవంత్‌తో భేటీ అయిన మందకృష్ణ మాదిగ.. ఎస్సీ ఉపకులాలను గ్రూప్1, 2, 3గా కాకుండా ఏ, బీ, సీ, డీలుగా విభజించాలని సూచించారు. అదే విధంగా ఏ కులానికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.

Tags:    

Similar News