సమాధానాలివ్వలేకే క్వశ్చన్ అవర్‌ల రద్దు: జగదీష్ రెడ్డి

ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట అని జగదీష్ రెడ్డి విమర్శించారు.;

Update: 2025-03-24 07:12 GMT

తన సస్పెన్షన్‌పై, అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న తీరును మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని నడపడం కాంగ్రెస్ చేతకావడం లేదన్నారు. అసెంబ్లీ అంటే వాళ్ల ఇంట్లో పెట్టుకునే టీపార్టీలా వాళ్లు ఫీల్ అవుతున్నారని, చట్టసభ అన్న రీతిలో వారు నడపలేకున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు చట్టసభలను నిర్వహించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే దమ్ము కూడా మంత్రులకు లేదని, అందుకే ప్రశ్నోత్తరాల సెషన్స్ ఎప్పటికప్పుడు రద్దు చేస్తున్నారని ఆయన చురకలంటించారు. లేకుంటే క్వశ్చన్ అవర్‌ను ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటో కూడా ఇప్పటి వరకు తెలపలేదని, బులెటిన్ ఎందుకు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆయనను లోపలికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రావొద్దనడానికి ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి? అని ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘అసెంబ్లీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. అందుకు కారణమేంటి. దీనిపై ఇప్పటి వరకు బులెటిన్ రిలీజ్ చేయలేదు. నన్ను సస్పెండ్ చేశారా, లేదా అనేది చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. బులెటిన్ విడుదల చేస్తే నేను అసెంబ్లీకి రాను. లేదంటే స్పీకర్‌ను వెళ్లి కలుస్తా. బులెటిన్ విడుదలయితే.. నా సస్పెన్షన్‌పై కోర్టుకు వెళ్తానన్న భయంతోనే బులెటిన్ విడుదల చేయడం లేదు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట. మంత్రులకు జవాబులు ఇవ్వలేకే ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నారు. దావత్‌లకు కూడా మంత్రులు ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారు’’ అని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే మార్చి 13న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జగదీష్ రెడ్డిని అసహనానికి గురికావొద్దంటూ స్పీకర్ అన్నారు. అందుకు స్పందించిన జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సభ అందరిదీ. సభ్యులందరికీ సభలో సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరుపున పెద్దమనిషిగా స్పీకర్ స్థానంలో మీరు కూర్చున్నారు. అంతే తప్ప ఈ సభ మీకు కూడా ఏమీ సొంతం కాదు’’ అని అన్నారు. ఆయన మాటలతో సభలో తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, చెయిర్‌ను అవమానించేలా మాట్లాడటం దారుణమని అన్నారు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీదర్ బాబు ప్రతిపాదించగా.. అందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News