‘కాంగ్రెస్ చేస్తుంది బీసీ రిజర్వేషన్ కాదు.. బీసీ మోసం’
బీసీల కోసం బీఆర్ఎస్ కూడా రాష్ట్రపతిని కలవనున్నట్లు చెప్పిన మాజీ మంత్రి తలసాని.;
బీసీ డిక్లరేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను, బీసీలను మభ్యపెట్టడంలో హస్తం ఫుల్ బిజీ అయిపోయిందని ఆరోపించారు. ఢిల్లీలో చేయనున్న ధర్నా కూడా అందులో భాగమేనని, బీహార్ ఎన్నికల కోసం ఢిల్లీలో దర్నా చేస్తూ దానికి బీసీ రిజర్వేషన్ల రంగు పులుముతోందంటూ తలసాని విమర్శనాస్త్రాలు సంధించారు. స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందు బీసీలకు రిజవర్వేషన్లను కాంగ్రెస్ అందించదని, పాత రిజర్వేషన్ల పద్దతితోనే ఎన్నికలకు వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజలు తిప్పికొట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం గుర్తుకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
ఆ స్థానాల్లో అగ్రవర్ణాలకే పెద్దపీట..
‘‘బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు.. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. ఎలా చేస్తారు? అని అప్పుడే మేము ప్రశ్నించారు. అప్పుడు తమ ప్లాన్ తమకు ఉందని, మీలా చేతకాని వాళ్లం కాదంటూ బీజేపీపై నోరేసుకుని పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక.. తప్పు మొత్తాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నెత్తిన రుద్దేస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల విషయంలో బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? భారత రాష్ట్ర సమితి తరఫున కూడా రాష్ట్రపతిని కలిసి.. 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరతాం. అధికార యంత్రాంగంలోనూ కీలకమైన స్థానాలను ఓ అగ్రవర్ణం వారికే ఇచ్చారు. కార్పొరేషన్ పదవుల్లో సగం బీసీలకు ఇవ్వాలి’’ అని తలసాని డిమాండ్ చేశారు.
బీసీల కోసం రంగంలోకి కేసీఆర్..!
బీసీలకు చెప్పిన రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడటం కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని సమాచారం. బీసీల కోసం మరోసారి పోరుబాట పట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కేసీఆర్ నాయకత్వంలో ఈ పోరును ముందుకు కొనసాగించనున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బీసీ నేతలంతా కూడా ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి, బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని కోరనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆగస్టు 8న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ సభ వేదికగా బీసీ రిజర్వేషన్లకు తాము అనుకూలంగా ఉన్నామనే స్పష్టమైన ప్రకటన ఇవ్వాడానికి బీఆర్ఎస్ హై కమాండ్ ఓ కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం.