బీజేపీకి ఝలక్.. ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులను గుర్తించడం కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచించింది.

Update: 2024-11-24 06:07 GMT

ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులను గుర్తించడం కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచించింది. దీనిని తప్పుబట్టిన బీజేపీ.. వీటిని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ లెజిస్టేచర్ పార్టీ, మరికొందరు కలిసి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33ను హైకోర్టులో సవాల్ చేశారు. వారి పిటిషన్‌పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ జరిపి తీర్పునిచ్చారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటును ఆయన సమర్థించారు. అంతేకాకుండా విధాన పరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 సబబే అని స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు బీజేపీ లెజిస్లేచర్‌కు భారీ షాకిచ్చింది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు పూర్తి అధికారాలను కలెక్టర్లకు కల్పించడం సరైన పద్దతే అని ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.

వాటి ఏర్పాటు రాజ్యాంగ విరుద్దం: పిటిషనర్లు

ఈ కేసు విచారణలో భాగంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్దమే అవుతుందన్నారు.. గ్రామసభ, వార్డు మావేశాలతో సంబంధం లేకుండా వీటిని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వం డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసింది. పైగా ఇందిరమ్మ కమిటీల సభ్యుల నియామకాలకు సంబంధించి విడుదల చేసిన జీవోలో ఎటువంటి అర్హతలు వెల్లడించలేదు. ఇందులో ఏదో మతలబు ఉంది. వీటి ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది’’ అని వారు వాదించారు. కాగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. జీవో 33 ప్రకారం ఇందిరమ్మ కమిటీల్లో గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, వార్డు స్థాయిలో కౌన్సిలర్ లేదా కార్మొరేటర్‌లు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ఉన్నట్లు వెల్లడించారు

‘‘ఇందిరమ్మ కమిటీల్లో స్వయం సహాయక గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు స్థానికులు సభ్యులు అవుతారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంతిమం కాదు. గ్రామసభల ద్వారానే అర్హుల ఎంపిక జరుగుతుంది. దీని వల్ల ఎవరి హక్కులకు ఎలాంటి భంగం కలగదు’’ అని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. ‘‘లబ్ధిదారుల ఎంపికలో ఇందరమ్మ కమిటీలది ఫైనల్ డెసిషన్ కాదు. కలెక్టర్‌కు అందిన దరఖాస్తులపై గ్రామాల్లో పంచాయతి అధికారి. మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి అధికారి నిర్వహిస్తారు. ఇందిరమ్మ కమిటీలు కేవలం లబ్ధిదారులను కనుగొనడానికి సహాయం మాత్రమే ఇస్తాయి. అర్హుల ఎంపికకు గ్రామసభలకు చట్టం అధికారం కల్పించింది’’ అని పేర్కొంటూ సదరు పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

Tags:    

Similar News