Crime | జనగామ జిల్లాలో తల్లీ కూతురు దారుణ హత్య
ఆస్తి తగాదాలే కారణమని పోలీసుల అనుమానం;
జనగామ జిల్లాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. జఫర్ గడ్ మండలం తమడపల్లి(ఐ) గ్రామంలో తల్లి (75)కూతురు(45) నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా తలలు పగులగొట్టి హత్య చేసి వెళ్లిపోయారు. జంట హత్యలు జనగామ జిల్లాలో సంచలనమైంది.
శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇద్దరూ విగత జీవులై రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.