అవినీతి చిక్కుల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన క్రికెట్ బంతుల కొనుగోల్ మాల్ బయటపడింది.;
By : Saleem Shaik
Update: 2025-07-12 01:41 GMT
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో సంక్షోభం నెలకొంది. హెచ్ సీ ఏ అధ్యక్షుడు, కోశాధికారిపై సీఐడీ కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేసిన నేపథ్యంలో క్రికెట్ అసోసియేషన్ లో నాయకత్వ మార్పుపై ప్రశ్నలు తలెత్తాయి. నిబంధనల ప్రకారం క్లబ్ ఉపాధ్యక్షుడు కొత్త ఆఫీస్ బేరర్లను నియమించడానికి ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అంటున్నారు.క్లబ్ లో క్రిమినల్ కేసులున్న వారిని జనరల్ బాడీలో మెజారిటీ ఓట్లతో తీర్మానం చేసి వారిని సస్పెండ్ చేయవచ్చు. అవినీతి ఆరోపణలు, కేసులున్న వారిపై హెచ్ సీ ఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు.
రంగంలోకి దిగిన ఈడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాల కేసుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారించారు.ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరిన ఈడీ దీనిపై కేసు నమోదు చేయనుంది. మరోవైపు ఈ కేసులో నిందితులను 10 రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఫోర్జరీ, మోసం, అక్రమాలపై ఈడీ కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. తాను హెచ్ సీ ఏ అధ్యక్షుడిగా గెలవడానికి మాజీ మంత్రి కృష్ణాయాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారనిి తేలింది. గౌలిపురా క్రికెట్ అసోసియేషన్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చి అందులో సభ్యుడిగా చేరిన జగన్ మోహన్ రావు 2023 అక్టోబరు 20వతేదీన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించినట్లు సీఐడీ దర్యాప్తు తేలింది.
అక్రమాలు ఎన్నెన్నో...
బీసీసీఐ మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేయడం , ఐపీఎల్ మ్యాచ్ ల కోసం సన్ రైజర్స్ పై ఒత్తిడి తీసుకువచ్చారని తెలంగాణ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో జగన్ మోహన్ రావుతోపాటు శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య క్లబ్ అధ్యక్షురాలు కవిత, హెచ్ సీ ఏ కోశాధికారి సీజే శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటేలను సీఐడీ అరెస్ట్ చేసింది. తప్పుడు బిల్లులతో నిధులను తమ ఖాతాల్లో మళ్లించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది.
8,340 క్రికెట్ బంతుల కొనుగోల్ మాల్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ జగన్ మోహన్ రావు ఇతరులు కలిసి 8,340 క్రికెట్ బంతులను కొనుగోలు చేయడానికి కోటి రూపాయల కంటే ఎక్కువగా చెల్లించారని, అందులోనూ ఆ క్రికెట్ బంతులు అందలేదని సీఐడీ కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. జగన్ మోహన్ రావు, సి. శ్రీనివాస్ రావు, సునీల్ కాంటే, మరో ఇద్దరిని గురువారం స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఎంఎస్ ఇండియానా స్పోర్ట్స్‌కు...
నిందితులు టెండర్ విధానాలను పాటించలేదని, తెలంగాణ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (పారదర్శకత) చట్టం-2017 హెచ్ సీ ఏ ఉప-చట్టాలలో పేర్కొన్న అన్ని సాధారణ సూత్రాలను ఉల్లంఘించారని తేలింది. 8,340 క్రికెట్ బంతుల కొనుగోలు కోసం ఎంఎస్ ఇండియానా స్పోర్ట్స్‌కు రూ. 1,03,74,118/ మొత్తాన్ని చెల్లించారు, దర్యాప్తులో ఒక్క బంతి కూడా రాలేదని వెల్లడైంది. రికార్డుల ప్రకారం సంబంధిత వ్యక్తులు డబ్బును దుర్వినియోగం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
సీఐడీ కేసు నమోదు
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువా రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 465 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ), 471 (ఫోర్జింగ్ డాక్యుమెంట్), 403 (ఆస్తిని దుర్వినియోగం చేయడం) 409 (ప్రజా సేవకుడు, బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత నమ్మక ద్రోహం), 420 (మోసం)రెడ్ విత్ 34 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.