అర్థరాత్రి సోలార్ ట్రాక్‌పై సైక్లింగ్, ఇదీ హైదరాబాద్ నయా ట్రెండ్

హైదరాబాద్‌లో కొత్తగా మిడ్ నైట్ సైక్లింగ్ అందుబాటులోకి వచ్చింది.యువతీ, యువకులు బర్త్ డే పార్టీలు,ఇతర వేడుక సందర్భంగా సోలార్ ట్రాక్ పై సైకిల్ సవారీ చేస్తున్నారు.;

Update: 2025-04-05 10:00 GMT
హైదరాబాద్ లో అర్థరాత్రి సైక్లింగ్ సందడి

అది హైదరాబాద్ నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న సోలార్ సైక్లింగ్ ట్రాక్... వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ కాంతులు...సమయం అర్థరాత్రి...హైటెక్ సిటీ ప్రాంతంలోని పలు కార్యాలయాల్లో పనిచేసి వచ్చిన యువతీ యువకులు కార్లు, మోటారుసైకిళ్లపై జట్లు జట్లుగా నార్సింగి వద్ద ఉన్న స్మార్ట్ బైక్ హబ్ వద్దకు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఈ బైక్స్, పెడల్ సైకిళ్లు తీసుకొని సోలార్ సైక్లింగ్ ట్రాక్ పై వెళ్లారు. కొంత సేపు సైక్లింగ్ చేశాక తిరిగి వచ్చి ఇళ్లకు వెళ్లి పోయారు.




 నయా పోకడ మిడ్ నైట్ సైక్లింగ్

అవుటర్ రింగ్ రోడ్డుపై హెల్దీ వే అయిన సోలార్ సైక్లింగ్ ట్రాక్ పై రాత్రి 10గంటల నుంచి మిడ్ నైట్ సైక్లింగ్ కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు. నార్సింగి సైకిల్ హబ్ కేంద్రంగా ప్రారంభమైన మిడ్ నైట్ సైక్లింగ్ లో ఐటీ యువతీ, యువకులు పాల్గొంటున్నారు. ప్రతిరోజు అర్థరాత్రి సైక్లింగ్ సోలార్ ట్రాక్ సైక్లిస్టులతో సందడిగా మారుతుంది. వీకెండ్స్ లో ఎక్కవ మంది యువతీ, యువకులు సైక్లింగ్ కోసం తరలివస్తున్నారని నార్సింగి బైక్ స్టేషన్ హెడ్ మామిడి శ్రవణ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 సైక్లిస్టుల కోసం 24/7 అందుబాటులో సైకిళ్లు

గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందిన హైదరాబాద్ నగరంలో కొత్తగా అర్థరాత్రి కూడా సైక్లింగ్ కు ప్రభుత్వం అనుమతించింది. వ్యాయామంతోపాటు ఆరోగ్యం, ఫిట్ నెస్, ఒకింత రిలాక్స్ కోసం యువతీ, యువకులు సైక్లింగ్ పై మక్కువ చూపుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాకుండా అర్దరాత్రి కూడా 24 గంటల పాటు సైక్లిస్టుల కోసం స్మార్ట్ బైక్స్ స్టేషన్లలో సైకిళ్లను అందుబాటులో ఉంచామని హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఛైర్మన్, వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ ఉపాధ్యక్షుడు డీవీ మనోహర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి రాత్రి దాకా నెక్లెస్ రోడ్డు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ పాలపిట్ల పార్కు వద్ద స్మార్ట్ బైక్స్ అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.



 మిడ్ నైట్ బర్త్ డే పార్టీలు, సైక్లింగ్ సందడి

హైదరాబాద్ నగరంలో కొత్తగా మిడ్ నైట్ సైక్లింగ్ అందుబాటులోకి వచ్చింది.యువతీ, యువకులు బర్త్ డే పార్టీలు, మ్యారేజ్ యానివర్శరీలు, ఇతర వేడుకల సందర్భంగా గ్రూపుల వారీగా వచ్చి సైకిళ్లతో సోలార్ సైక్లింగ్ ట్రాక్ పై సైకిల్ సవారీ చేస్తున్నారు.నగరంతోపాటు నగర శివార్లలోని బర్త్ డే స్పాట్లు సైక్లిస్టులతో సందడిగా మారాయి. దీంతో సైక్లింగ్ కోసం 24/7 అందుబాటులో ఉండేలా హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఆధ్యరంలో స్మార్ట్ సైక్లింగ్ స్టేషన్లు ఇప్పటికే గచ్చిబౌలి, నెక్లెస్ రోడ్డు, పాలపిట్ల సైక్లింగ్ పార్కులు నడుస్తున్నాయి. మరో వైపు కొత్తగా జూపార్కులోనూ ఈ సైక్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.



 సోషల్ మీడియాలో మిడ్ నైట్ సైక్లింగ్ వైరల్

మిడ్ నైట్ సైక్లింగ్ పై యూట్యూబర్స్, ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సైక్లింగ్ చేసి, ఆయా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. మిరిమిట్లు గొలుపుతున్న విద్యుత్ కాంతుల మధ్య సోలార్ ట్రాక్ పై సైక్లింగ్ సవారీ తమకు ఎంతో ఇష్ణమని ఐటీ ఉద్యోగిని ఆర్ నీలిమ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తన బర్త్ డే సందర్భంగా తన మిత్రులతో కలిసి సోలార్ ట్రాక్ వద్ద సైక్లింగ్ చేసి, ఆపై మిడ్ నైట్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నామని గంజి కిరణ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.నగరంలోని సైక్లింగ్ ట్రాక్ ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాకుండా రాత్రి వేళల్లోనూ సైక్లిస్టులతో సందడిగా మారింది.

సైకిల్ అద్దె ఎంతంటే...
వారాంతాలు, సెలవు రోజుల్లో ఈబైక్ అద్దె 30 నిమిషాలకు 80 రూపాయలు ప్లస్ జీఎస్ టీ, పెడల్ బైక్‌లు అయితే 50 రూపాయలు ప్లస్ జీఎస్టీ. సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే ఈబైక్ గంటకు 80 రూపాయలు ప్లస్ జీఎస్టీ, పెడల్ బైక్‌లకు 50 రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తున్నారు. మిడ్ నైట్ సైక్లింగ్ సమయం రాత్రి 10 గంటలకు ప్రారంభం అయి ఉదయం ఆరు గంటల వరకు నడుస్తుందని నార్సింగి బైక్ స్టేషన్ హెడ్ మామిడి శ్రవణ్ కుమార్ చెప్పారు.



 స్లైక్లిస్టుల కోసం 7,500 బైక్స్

పర్యావరణ అనుకూల రవాణాలో భాగంగా తాము సైకిల్ సవారీని ప్రోత్సహిస్తున్నామని హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఛైర్మన్, వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ ఉపాధ్యక్షుడు డీవీ మనోహర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.కాలుష్య నియంత్రణతోపాటు పచ్చని ప్రపంచం కోసం స్మార్ట్ బైక్ పేరిట 7,500 బైక్ లను హైదరాబాద్, చెన్నై,చంఢీఘడ్, న్యూడిల్లీ, ఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్ లలో అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర సచివాలయంలోనూ తమ బైక్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. సైక్లింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, స్వతహాగా సైక్లిస్టు అయిన తాను సైక్లింగ్ ను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.



తండ్రీ కొడుకుల లండన్ సైకిల్ ఛాలెంజ్‌

హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఛైర్మన్ డీవీ మనోహర్ 2011వ సంవత్సరం జూన్ నెలలో తాను 520 కిలోమీటర్లకు పైగా సాగిన లండన్ నుంచి పారిస్ సైకిల్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 2013వ సంవత్సరం మే నెలలో పై లండన్ నుంచి పారిస్ సైకిల్ ఛాలెంజ్‌ను రెండోసారి పూర్తి చేశారు. తండ్రి మనోహర్ బాటలో కుమారుడు ధర్మిన్ కూడా లండన్ నుంచి పారిస్ వరకు రెండుసార్లు సైక్లింగ్‌లో పాల్గొని విజయం సాధించారు. స్టార్టప్ ఇండియా ఫైనలిస్ట్ అయిన ధర్మిన్ ప్రధాని మోదీతో మాట్లాడుతూ దేశంలో సైక్లింగ్ ను ప్రోత్సహించేందుకు జాతీయ విధానాన్ని తీసుకురావాలని కోరారు.

సైక్లింగ్‌తో ఫిట్‌నెస్ సాధ్యం : డాక్టర్ డి రామమోహన్ రావు
సైక్లింగ్ వల్ల ఫిట్‌నెస్ సాధ్యం అవుతుందని , ఇది ఆరోగ్యానికి మంచిదని హైదరాబాద్ నగరంలోని ఆశ్రిత ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి రామమోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రతీ రోజూ సైక్లింగ్ చేయడం వల్ల స్థూలకాయం సమస్య దరిచేరదని చెప్పారు. వ్యాయామంలో భాగంగా సైక్లింగ్ మనిషికి ఉత్తేజాన్ని ఇస్తుందని డాక్టర్ చెప్పారు.

మిడ్ నైట్ సైక్లింగ్ గుండెజబ్బులున్న రోగులకు హానికరం : డాక్టర్ వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

మిడ్ నైట్ సైక్లింగ్ గుండెజబ్బులున్న రోగులకు హానికరం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ జిల్లా పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు సోలార్ సైక్లింగ్ ట్రాక్ పై అర్థరాత్రి సైక్లింగ్ చేస్తున్నారని, అయితే గుండె జబ్బులున్న వారు దీనికి దూరంగా ఉండాలని డాక్టర్ సూచించారు. ఆరోగ్యంగా ఉన్న యువతీ యువకులు సైక్లింగ్ చేస్తే ఇబ్బంది లేదని, గుండెజబ్బులున్న వారు మాత్రం అర్థరాత్రి సైక్లింగ్ చేయకూడదన్నారు. నిద్రపోయే సమయంలో సైక్లింగ్ చేయడం వల్ల దుష్పరిణామాలు వచ్చే అవకాశముందని డాక్టర్ వెంకటేశ్వరరావు వివరించారు.




Tags:    

Similar News