ఇంటికొకరు మంచం పట్టారు,రికార్డు స్థాయిలో డెంగీ కేసులు
ఒక వైపు భారీ వర్షాలు,మరోవైపు వరదలు,దోమలు వ్యాప్తి చెందడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. డెంగీతో ఇంటికొకరు మంచం పట్టారు.
By : The Federal
Update: 2024-09-24 00:25 GMT
ఈ ఏడాది వర్షాకాలంలో డెంగీ జ్వరాలు ప్రబలుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు వణుకుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దోమల వ్యాప్తితో డెంగీ జ్వరాల జోరు పెరిగింది. హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో ఇంటికొకరు జ్వరంతో మంచం పట్టారు.
- తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 20 వతేదీ వరకు 8,027 డెంగీ కేసులు అధికారికంగా నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. అయితే అధికారికంగా నమోదైన డెంగీ కేసుల సంఖ్య కంటే ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్నాయని హైదరాబాద్ నగరానికి చెందిన ఆశ్రిత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ రామమోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ డెంగీ కేసుల సంఖ్య పెరిగింది. ఒక్క కాకినాడ జిల్లాలోని 160 డెంగీ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో విదితమవుతోంది. విశాఖపట్టణంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో జ్వరాలతో ఒకరోజే 2,632 మంది జనరల్ మెడిసిన్ ఓపీకి వచ్చారంటే ఈ జ్వరాల జోరు ఏమిటో తెలుస్తుంది.
- తెలంగాణలో వైద్యఆరోగ్య శాఖ జరిపిన ఇంటింటి జ్వర సర్వేలో 2.45 లక్షల మందికి జ్వరాలు వచ్చాయని వెల్లడైంది. డెంగీనే కాదు చికున్ గున్యా, మలేరియా, వైరల్, టైఫాయిడ్ జ్వరాలు కూడా వ్యాప్తిచెందుతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. జ్వరాల బారిన పడిన రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 104 జ్వరంతోపాటు ప్లేట్ లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుండటంతో చికిత్స కోసం డెంగీ రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
విజృంభిస్తున్న దోమలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది వరుసగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. చెత్త పేరుకుపోయి మురుగుగుంటలు ఏర్పడ్డాయి. దీని వల్ల దోమలు విపరీతంగా విజృభిస్తున్నాయి. దోమలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. హైదరాబాద్, కాకినాడ ప్రాంతాలు డెంగీకి హైరిస్క్ ప్రాంతాలుగా మారాయి.
డెంగీ హైరిస్క్ జిల్లాలు
హైదరాబాద్ నగరంతోపాటు సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ జిల్లాల్లో డెంగీ జ్వరాల కేసులు అధికంగా నమోదు కావడంతో ఆయా జిల్లాలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హైరిస్క్ జిల్లాలుగా గుర్తించింది. డెంగీ కేసుల సంఖ్య నమోదుతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలోనే జ్వరపీడితుల సంఖ్య పెరిగింది.
డెంగీ జ్వరాల పాజిటివ్ రేటు పెరిగింది...
గత ఏడాది 9 నెలల కాలంలో 8,016 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఈ కేసుల సంఖ్య 8,027 మార్కు దాటింది. ఏ రోజుకారోజు డెంగీ కేసుల సంఖ్య పెరుగుతుందడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది డెంగీ జ్వరాల పాజిటివ్ రేటు 8 నుంచి 10 శాతానికి పెరిగాయని వైద్యులే చెబుతున్నారు. ఇప్పటికే డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. అక్టోబరు నెలలో డెంగీ జ్వర పీడితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్యులు అంచనా వేశారు. భారీవర్షాలు, దోమల వ్యాప్తితో ప్రతీ నాలుగేళ్లకు ఓసారి తెలంగాణలో డెంగీ జ్వరాలు అధికంగా ప్రబలుతున్నాయని గాంధీ ఆసుపత్రి మాజీ వైద్యుడు డాక్టర్ యం ప్రభాకర్ రావు చెప్పారు. 2019వ సంవత్సరంలో 13,331 డెంగీ కేసులు నమోదు కాగా, మళ్లీ ఈ ఏడాది డెంగీ కేసులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
డెంగీ జ్వరంతో బాలిక మృతి
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ద్యావనపల్లి దీక్ష అనే పన్నెండేళ్ల బాలిక డెంగీ జ్వరంతో మరణించింది. 5వతరగతి చదువుతున్న ఈ బాలికకు డెంగీ జ్వరం రావడంతో ఆమెను చికిత్స కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో బాలికను హైదరాబాద్ కు తీసుకువచ్చి ఇక్కడి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నా, బాలిక మరణించింది.
కాకినాడలో యువతి మృత్యువాత
కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన కృప(20) డెంగీ జ్వరంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది.