KTR Arrest Fear|అరెస్టుభయంతోనే కేటీఆర్ మాటమార్చారా ?
తప్పంతా అర్వింద్ మీదకు తోసేసి తాను సేఫ్ గా ఉండాలని కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అందరిలోను అనుమానం పెరిగిపోతున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా వాదనచూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ కు వ్యతిరేకంగా కోర్టులో ఏసీబీ కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేసింది. తనమీద కేసు నమోదుచేయటాన్ని సవాలు చేస్తు కేటీఆర్(KTR) పిటీషన్ వేశారు. దానిమీద ఏసీబీని కౌంటర్ దాఖలుచేయాలని హైకోర్టు ఏసీబీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఏసీబీ దాఖలుచేసిన కౌంటర్ అఫిడవిట్ కు కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలుచేశారు. రిప్లై కౌంటర్లో తాజాగా కేటీఆర్ వాదన చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యమేసింది. కారణం ఏమిటంటే గతంలో తాను చేసిన ప్రకటనకు రిప్లై కౌంటర్ పూర్తిగా వ్యతిరేకంగా ఉండటమే. జనవరి 7వ తేదీన విచారణకు హాజరవ్వాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీచేయగానే కేటీఆర్ కొత్తవాదన వినిపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఫార్ములా కార్ రేసు(Formula E Car Race) నిర్వహణకు సంబంధించి విదేశీకంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్ఈవో) సంస్ధకు పౌండ్ల రూపంలో హెచ్ఎండీఏ రు. 45 కోట్లు బదిలీచేసిన విషయం తెలిసిందే.
ఆర్ధికశాఖ, రిజర్వ్ బ్యాంకు అనుమతులు లేకుండానే హెచ్ఎండీఏ 45 కోట్ల రూపాయలను విదేశీకంపెనీకి బదిలీచేయటం తప్పని ఇప్పటికే నిర్ధారణైంది. ఈ విషయంలోనే కేటీఆర్ మెడుకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేసమయంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నపుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ నిధులను బదిలీచేశారు. కేటీఆర్ నోటిమాటగా ఇచ్చిన ఆదేశాలతోనే తాను విదేశీకంపెనీకి రు. 45 కోట్లను బదిలీచేసినట్లు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నిర్వహించిన అంతర్గతవిచారణలో అర్వింద్ కుమార్ రాతమూలకంగా వాగ్మూలమిచ్చారు. చీఫ్ సెక్రటరి జరిపిన విచారణలో అర్వింద్ ఇచ్చిన వాగ్మూలమే కేటీఆర్ ఇరుక్కోవటానికి బలమైన ఆధారంగా మారింది. అర్వింద్ వాగ్మూలం ఇచ్చిన విషయం బయటకుపొక్కగానే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు తన ఆదేశాల ప్రకారమే ఉన్నతాధికారులు నిధులు బదిలీచేశారని స్వయంగా కేటీఆరే అంగీకరించారు. పైగా ఎక్కడా అవినీతి జరగలేదని ఏం పీక్కుంటావో పీక్కో అంటు పదేపదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు.
అర్వింద్ వాగ్మూలాన్ని కోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలులో స్పష్టంగా ప్రస్తావించింది. దాంతో రిప్లై కౌంటర్లో కేటీఆర్ విచిత్రమైన వాదన వినిపించారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే ‘విదేశీకంపెనీలతో ఒప్పందాలు, నిబంధనల అమలు, నిధుల విడుదల అంతా అధికారులు చూసుకోవాల్సిందే’ అని అన్నారు. ‘అధికారులు చూసుకోవాల్సిన విధానపరమైన అంశాలతో తనకు ఎలాంటి సంబంధంలేదు’ అని వినిపించిన వాదనే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదివరకేమో తన ఆదేశాల ప్రకారమే అధికారులు నిధులు బదిలీచేశారని చెప్పిన కేటీఆర్ తాజా రిప్లై అఫిడవిట్లో నిధుల బదిలీతో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పటం అంటే కేసునుండి తాను తప్పించుకోవాలని చూస్తున్నట్లు అర్ధమైపొతోంది. మొత్తం తప్పంతా అర్వింద్ మీదకు తోసేసి తాను సేఫ్ గా ఉండాలని కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అందరిలోను అనుమానం పెరిగిపోతున్నది.
అర్విందే కారణమా ?
ఫార్ములా అవినీతి వ్యవహారం వెలుగుచూడగానే కేటీఆర్ వైఖరిపై అర్వింద్ కుమార్ కు బాగా అనుమానం మొదలైనట్లుంది. అందుకనే తనమీద కేసులు లేకుండా చూసేట్లయితే తాను అప్రవూర్ గా మారుతానని అర్వింద్ ప్రభుత్వంలోని పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిధుల బదిలీలో ఎవరిపాత్ర ఏమిటో ఆధారాలతో సహా వివరిస్తానని ప్రతిపాదించినట్లుగా సమాచారం. అర్వింద్ గనుక అప్రూవర్ గా మారితే తాను కచ్చితంగా ఇరుక్కోవటం ఖాయమని కేటీఆర్ కు అర్ధమైనట్లుంది. అందుకనే తన రిప్లై అఫిడవిట్లో నిధుల బదిలీ అంతా అధికారులు చూసుకోవాల్సిందే కాని తనకు ఎలాంటి సంబంధంలేదని వాదన వినిపించారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అర్వింద్ అప్రూవర్ గా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనించిన తర్వాతే తనను తాను రక్షించుకోవటం కోసం కేటీఆర్ మాట మార్చినట్లు అర్ధమవుతోంది. మరి జనవరి 2,3 తేదీల్లో ఈడీ(ED Inquiry) విచారణలో అర్వింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏమి చెప్పబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది.