ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఎవరేమన్నారు ?

సంవత్సరాలుగా ఎవరూ టచ్ చేయలేకపోయినా కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా జస్ట్ ఐదుగంటల్లో నేలమట్టం చేసేసింది.

Update: 2024-08-25 07:00 GMT
N convention demolition

అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసింది. సంవత్సరాలుగా ఎవరూ టచ్ చేయలేకపోయినా కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా జస్ట్ ఐదుగంటల్లో నేలమట్టం చేసేసింది. కన్వెన్షన్ సెంటర్ నాగార్జునది అయినా, తానెంత పలుకుబడి ఉన్న వ్యక్తయినా సరే హైడ్రా లెక్కచేయలేదు. ఒకవిధంగా కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అన్నది మిగిలిన అక్రమనిర్మాణాల కూల్చివేతకు ఒక వార్నింగ్ అనే చెప్పాలి జన్వాడ ఫాం హౌస్ తో కలిపి. ఎందుకంటే కొన్నివందల ప్రముఖులకు 111 జీవో పరిధిలో వందల ఎకరాల్లో ఫాం హౌసులున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ప్రముఖులు అనేకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మొత్తంలో హైడ్రా కూల్చివేతలకు బీజేపీ మద్దతు పలకటమే ఆశ్చర్యంగా ఉంది. ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయాన్ని చూస్తే కూల్చివేతలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కూల్చివేతలన్నీ డ్రామాలంటున్నారు. చేతనైతే మామూలు జనాలవి కావని ముందు ప్రముఖుల ఫాం హౌసులను కూల్చాలని ప్రభుత్వాన్ని పదేపదే రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టడమే కాకుండా పార్టీ ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ ప్రముఖుల్లో ఎవరెవరికి ఫాం హౌసులున్నాయనే విషయాన్ని వైరల్ చేశారు. విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతే. కాకపోతే గుత్తా కారుపార్టీకి దూరమైపోయారు.

మరికొందరు నేతలు ఈమధ్యనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి దూకారు. హైడ్రా ఎక్కడ తన జన్వాడలోని తానుంటున్న ఫాంహౌస్ ను కూల్చేస్తుందో అన్న టెన్షన్ కేటీఆర్లో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే కూల్చివేతలను ఏకమొత్తంగా వ్యతిరేకించటం కాకుండా ముందు ప్రముఖుల ఫాం హౌసులను కూల్చండి దమ్ముంటే అని చాలెంజ్ చేస్తున్నారు.

ఇదే విషయమై బీజేపీ దుబ్బాక ఎంపీ రఘునందనరావు మాట్లాడుతు కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై కోర్టు స్టే ఇవ్వటాన్నే తప్పుపట్టారు. చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమనిర్మాణాలను చేయటాన్ని సుప్రింకోర్టు గతంలోనే తప్పుపట్టిన విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు. నీటివనరులను చేసిన ఆక్రమణలను కూల్చేటపుడు నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరంలేదని సుప్రింకోర్టు చెప్పిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. కన్వెన్షన్ సెంటర్ను చెరువు ఆక్రమించి నిర్మించారని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. చెరువును ఆక్రమించి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తున్నా కోర్టు స్టే ఇవ్వటం ఏమిటని ఆశ్చర్యపోయారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతు హైడ్రాదంతా పెద్ద డ్రామాగా కొట్టిపాడేశారు. సంవత్సరాలుగా అసలు అక్రమనిర్మాణాలు జరుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు చూస్తు ఊరుకున్నాయని ప్రశ్నించారు. అక్రమనిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులందరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలు చూడకుండా అక్రమనిర్మాణాలన్నింటినీ కూల్చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని చాలెంజ్ చేశారు.

నాగార్జున ట్విట్టర్లో మాట్లాడుతు కన్వెన్షన్ నిర్మాణంలో తాను చెరువును ఆక్రమించలేదన్నారు. పూర్తిగా పట్టాభూమిలోనే తాను నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. గతంలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. కోర్టు స్టే ఇచ్చినా నిర్మాణాన్ని కూల్చటం ఏమిటని నాగార్జున మండిపోయారు. కూల్చివేతలపై తాను కోర్టుకు వెళ్ళినట్లు చెప్పిన నాగార్జున లీగల్ గా పోరాటం చేస్తామన్నారు.

ఇక హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ మాట్లాడుతు నాగార్జున నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ నూరుశాతం అక్రమ నిర్మాణమే అన్నారు. గతంలో కోర్టు స్టే ఇచ్చిందని చెప్పటం అబద్ధమన్నారు. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అసలు జీహెచ్ఎంసీ అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. 3.30 ఎకరాలను ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు రంగనాధ్ ఆరోపించారు. అక్రమనిర్మాణాన్ని సక్రమం చేసుకునేందుకు గతంలో నాగార్జున చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించినట్లు చెప్పారు. చట్టపరమైన అంశాలను తాము పరిశీలించిన తర్వాతే సెంటర్ ను హైడ్రా కూల్చేసిందని రంగనాధ్ స్పష్టంగా చెప్పారు. గతంలో కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేయాలని లోకాయుక్తా కూడా ఆదేశించిన విషయాన్ని కమీషనర్ గుర్తుచేశారు. మొత్తంమీద కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోందన్నది వాస్తవం. రాజకీయంగా ఎవరి గొడవలు ఎలాగున్నా జనాలైతే ఫుల్లు హ్యాపీ ఫీలవుతున్నారు.

Tags:    

Similar News