ఎంఎల్ఏ గాలి జనార్ధన రెడ్డిపై అనర్హత వేటు
తీర్పు అధికారికంగా అందిన వెంటనే కర్నాటక అసెంబ్లీ కార్యదర్శి చాలా వేగంగా స్పందించి ఎంఎల్ఏపై అనర్హత వేటు వేయటం గమనార్హం;
అనుకున్నట్లుగానే మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి ఎంఎల్ఏ పదవిపై వేటుపడింది. ఓబుళాపురం ఇనుప గనుల తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా గాలిపైన ఉన్న ఆరోపణలను సాక్ష్యాలతో కోర్టులో సీబీఐ(CBI Court) నిరూపించింది. 14 ఏళ్ళ పాటు కేసు విచారణ జరిగిన తర్వాత నాలుగు రోజుల క్రితమే అక్రమాలకు పాల్పడినందుకు గాలి(Gali Janardhana Reddy)కి సీబీఐ కోర్టు ఏడేళ్ళు జైలుశిక్ష విధించింది. ఎప్పుడైతే గాలికి ఏడేళ్ళ శిక్షపడిందో వెంటనే కర్నాటక అసెంబ్లీ యాక్టివేట్ అయ్యింది. ఏవిధంగా అంటే శుక్రవారం గాలి ఎంఎల్ఏ పదవిని రద్దుచేస్తు అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షి నోటిఫికేషన్ జారీచేశారు. గాలికి శిక్ష విధించిన తీర్పు అధికారికంగా అందిన వెంటనే కర్నాటక అసెంబ్లీ కార్యదర్శి చాలా వేగంగా స్పందించి ఎంఎల్ఏపై అనర్హత వేటు వేయటం గమనార్హం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1),(ఇ), 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ప్రజాప్రతినిధికి కోర్టు 2 ఏళ్ళు, అంతకుమించి జైలుశిక్ష విధిస్తే ఆటోమేటిగ్గా ప్రజాప్రతినిధి పదవిపై అనర్హత వేటుపడుతుంది. తీర్పు అధికారికంగా అసెంబ్లీ కార్యదర్శి లేదా శాసనమండలి ఛైర్మన్ కు అందగానే అనర్హత ప్రక్రియ మొదలవుతుంది. తీర్పును ఉదహరిస్తు సదరు ప్రజా ప్రతినిధికి స్పీకర్ లేదా ఛైర్మన్ నుండి నోటీసు అందుతుంది. అందులో పలానా తీర్పు, జైలుశిక్ష ప్రకారం అనర్హత వేటు వేస్తున్నట్లు సమాచారం ఉంటుంది. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. అదేమిటంటే శిక్షపడిన ప్రజాప్రతినిధి మూడునెలల్లోగా ఎగువకోర్టులో కేసు వేయచ్చు. కిందికోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తు వేసిన పిటీషన్ను ఎగువకోర్టు గనుక విచారణకు స్వీకరించి, స్టే ఇస్తే అప్పుడు ప్రజాప్రతినిధిపై అనర్హ వేటు తాత్కాలికంగా తప్పుతుంది.
ఒకవేళ ఎగువకోర్టు కేసును విచారించి కిందికోర్టు విధించిన శిక్షను సమర్ధిస్తే అనర్హత వేటు అమల్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ కిందికోర్టు విధించిన శిక్షను కొట్టేస్తే అప్పుడు అనర్హత వేటు పూర్తిగా తప్పి మళ్ళీ ప్రాజాప్రతినిధిగా కంటిన్యు అవ్వచ్చు. ఇందుకు రెండు ఉదాహరణలున్నాయి. మొదటిది లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్, రెండోది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి(Rahul Gandhi). ఒక మర్డర్ కేసులో ఫైజల్ కు కవరట్టి కోర్టు 2023, జనవరిలో పదేళ్ళు శిక్ష విధించింది. ఈ తీర్పు ప్రకారం లోక్ సభ సెక్రటేరియట్ ఫైజల్ పై అనర్హత వేటువేసింది. అయితే ఎంపీ వెంటనే కేరళ హైకోర్టులో చాలెంజ్ చేసి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు ఎథిక్స్ కమిటి హైకోర్టును పరిశీలించి సభత్వాన్ని పునరుద్ధరించాలని చెప్పటంతో మళ్ళీ మార్చి 29వ తేదీన సెక్రటేరియట్ సభత్వాన్ని పునరుద్ధరించింది.
అలాగే రాహుల్ గాంధి ఎంపీ సభత్వంపైన అనర్హత వేటుపడి తర్వాత పునరుద్ధరణ జరిగింది. ఇదెలాగ జరిగిందంటే కర్నాటక ర్యాలీలో దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటుందో అని వ్యగ్యంగా మాట్లాడారు. దీనిపై గుజరాత్ లోని సూరత్ వెస్ట్ ఎంఎల్ఏ పూర్ణేష్ మోదీ కోర్టులో రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. కేసును పరిశీలించిన సూరత్ కోర్టు 2023, ఏప్రిల్ 20న రాహుల్ కు రెండేళ్ళు శిక్షపడింది. శిక్షపడగానే లోక్ సభ సెక్రటేరియట్ 2024, రాహుల్ పై అనర్హత వేటువేసింది. కోర్టు తీర్పివ్వగానే గుజరాత్ హైకోర్టులో రాహుల్ కేసు వేసినా ఉపయోగంలేకపోయింది. సూరత్ కోర్టు తీర్పునే హైకోర్టు సమర్ధించింది. దాంతో రాహుల్ సుప్రింకోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేస్తే స్టే వచ్చింది. దాంతో రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది.
ఇదేపద్దతిలో గాలి జనార్ధనరెడ్డిపై సీబీఐ కోర్టు ఏడేళ్ళ శిక్ష విధించింది. ఎలాగు సీబీఐ కోర్టు విధించిన శిక్షను ఎగువకోర్టులో సవాలు చేయబోతున్నట్లు గాలి లాయర్ మీడియాతో ఆరోజే చెప్పారు. కాబట్టి గాలి కేసు ఎగువకోర్టులో ఏమవుతుందో చూడాలి.