గిరిజన విద్యార్థులకు సీతక్క ల్యాప్‌టాప్‌లు పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు గిరిజన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను మంత్రి ధనసరి సీతక్క బహూకరించారు.
By : The Federal
Update: 2024-11-04 08:18 GMT
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి ధనసరి సీతక్క సోమవారం సమీక్షించారు. బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవనంలో గిరిజన సంక్షేమంపై సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల కోసం హెల్త్ మానిటరింగ్ యాప్ ను ప్రారంభించారు.
ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహుకరించారు. ఈ సమావేశంలో గిరిజన సంస్థ ఛైర్మన్ కొట్నాక్ తిరుపతి, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, ఐటిడిఏ పీఓలు, డిప్యూటీ డైరెక్టర్లు, గిరిజన పాఠశాలలు, గురుకులాల ప్రిన్సిపాల్స్, వార్టెన్లు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హెల్త్ మానిటరింగ్ యాప్ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.కాస్మోటిక్, డైట్ చార్జీలు భారీగా పెంచిన సందర్భంగా ప్రభుత్వానికి సమావేశంలో ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.చార్జీలు పెంచేందుకు కృషిచేసిన మంత్రి సీతక్కను టీచర్లు ఘనంగా సన్మానించారు.
నా మనసంతా గిరిజన సంక్షేమంపైనే...
‘‘నేను ఏ శాఖలో మంత్రిగా ఉన్నా నా మనసు గిరిజన సంక్షేమం మీద ఉంటుంది,నా ప్రాణం ఆదివాసి, గిరిజనులు, చెంచుల గురించి కొట్టుకుంటుంది ..వారి సమస్యలను తెలుసుకునేందుకు అచ్చంపేట వంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటా’’అని సీతక్క చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న టీచర్లకు పదోన్నతులను సీఎం కల్పించారు.. బదిలీల ప్రక్రియను పూర్తి చేశారని మంత్రి చెప్పారు.
నేను కూడా హాస్టల్ లోనే జీవితం గడిపా...
‘‘టీచర్లు విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలి,సొంత పిల్లల్లాగానే వారిని తీర్చిదిద్దాలి..అందరిలో కెల్లా గిరిజనవిద్యార్థులను ముందంజలో నిలిపేలా పనిచేయాలి ,అప్పుడు విద్యార్థులు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు’’ అని మంత్రి పేర్కొన్నారు. తాను కూడా హాస్టల్లోనే జీవితం గడిపానని, చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని మంత్రి గుర్తు చేసుకున్నారు. గూడేలు, తండాల నుంచి వచ్చిన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ క్రీడల పోటీల్లో పతకాలు సాధిస్తున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు గిరిజనుల సంక్షేమం కోసం రూ. 17 వేల కోట్లు కేటాయించారని మంత్రి వెల్లడించారు.
బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసి భవనంలో గిరిజన సంక్షేమంపై సమీక్షా సమావేశంలో పాల్గొని, కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించాం. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల కోసం హెల్త్ మానిటరింగ్ యాప్ ను ప్రారంభించానము. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు… pic.twitter.com/DIgcobamum
— Danasari Seethakka (@meeseethakka) November 4, 2024