‘రేవంత్ రెడ్డికి ముందే చెప్పా’.. ఫార్మా సిటీపై డీకే అరుణ

ఫార్మా సిటీ భూసేకరణపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన అధికారులపై దాడులు చేసిన ఘటన తెలంగాణ అంతటా తీవ్ర దుమారం రేపుతోంది.

Update: 2024-11-12 11:14 GMT

ఫార్మా సిటీ భూసేకరణపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన అధికారులపై దాడులు చేసిన ఘటన తెలంగాణ అంతటా తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయపరంగా కూడా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీలు, బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు పలువురు ఘాటుగా స్పందించారు. తాజాగా ఈ విషయంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా స్పందించారు. ఫార్మా సిటీ విషయంలో పంతాలకు పోవద్దని సీఎం రేవంత్‌కు తాను గతంలోనే చెప్పానంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టా భూముల జోలికి వెళ్లొద్దని కూడా హెచ్చరించానని, అయినా తన మాటను వినకుండా భూసేకరణ అంటూ అధికారులను పంపించడంతో ఇటువంటి దుస్థితి వచ్చిందని అన్నారు.

కొడంగల్ ఘటన బాధాకరం

‘‘కొడంగల్ నియోజకవర్గం లగవర్ల‌ దాడి ఘటన దురదృష్టకరం, బాధాకరం. ఈ దాడులను ఎవరైనా ఖండించాల్సిందే. అక్కడ జరగకూడని సంఘటన జరిగింది. ఫార్మా కంపెనీల పేరుతో ఫస్ట్ ఫేజ్‌లో 1500 ఎకరాలు రెండో ఫేజ్‌లో 1500 ఎకరాల భూసేకరణ చేయనున్బట్లు తెలిసింది. ఈ ఫార్మా కంపెనీలు వద్దని లగచర్లతో సహా మరో 5 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల‌ సమయం నుంచి అక్కడి‌ ప్రజలు ఫార్మా వద్దని మాకు సపోర్ట్ చేయమని కోరారు. భూసేకరణ పేరుతో అధికారులు చర్యలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు. పార్మా బాధితుల ధర్నాలో నేను పాల్గొన్నాను . మా ప్రాణాలు పోయినా భూములు‌ ఇవ్వబోమని ఆ గ్రామాల ప్రజలు ముందు నుంచే చెబుతున్నారు. ఫార్మా కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని‌ కోరాము’’ అని చెప్పుకొచ్చారు.

అసలు జరిగింది ఇది

‘‘గతంలోనే ఫార్మా బాధితుల విషయమై జిల్లా కలెక్టర్‌తో ‌మాట్లాడాను. ఫార్మా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పంతానికి పోవద్దని గతంలో చెప్పాను. నిన్న ప్రజాభిప్రాయ సేకరణ కోసం మీటింగ్ పెట్టారు. .ఆ ప్రజాభిప్రాయానికి చాలా‌ మంది ప్రజలు రాలేదు. కలెక్టర్, ఇతర అధికారులు సెక్యూరిటీ‌ లేకుండా లగచర్లకు పోవడం వల్లే ఉద్రిక్తత. కాన్వాయ్‌తో కలెక్టర్ రావడంతో స్తానిక‌ ప్రజలు ఎక్కడ భూములు పోతాయోనని భయపడి దాడులు‌ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ అని తెలిస్తే దాడులు చేసేవాళ్లము‌ కాదు’’ అని అన్నారు.

దాడులు ముమ్మాటికీ తప్పే

‘‘లగచర్ల గ్రామస్తులు చేసింది వంద శాతం తప్పే. ఈ విషయంలో బాధ్యులు ఎవరనేది నిగ్గు తేలాల్సింది. ఫార్మా విషయంలో‌‌ స్థానికుల చాలా బాధతో‌ ఉన్నారు. గొడవలకు‌ కారణమైన‌ వారు‌ ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి. సీఎం‌ రేవంత్ ఫార్మా విషయంలో పంతానికి పోవద్దు. ప్రజాభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిన అవసరం‌ ఉన్నది. సిఎం స్థాయిలో‌ ఉన్నారు.. మీ నియోజకవర్గ ప్రజలను, గ్రామాలని ఇబ్బంది పెట్టొద్దు’’ అని సూచించారు.

భయంతోనే దాడులు

‘‘తమ భూములు పోతాయనే భయంతోనే దాడులు చేశారు ప్రజలు. సీఎం రేవంత్ ఈ‌విషయంలో సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. కలెక్టర్ , స్పెషల్ ఆఫీసర్ పై దాడుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే.. ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది. ఆ గ్రామాలకు వెళ్తే ఏం‌ జరుగుతుందో తెలుసుకోలేరా. ప్రభుత్వం నిఘా వైఫల్య లోపం స్పష్టం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు రేపు లగచర్లకు వెళ్తాను. సంయమనంతో వ్యవహరించాలి, సామరస్యపూర్వకంగా ఉండాలని ప్రజలకు చెప్తాను’’ అని అన్నారు.

Tags:    

Similar News