బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ నిలుస్తుందా ?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ జారీచేయాలన్న క్యాబినెట్ నిర్ణయం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది;

Update: 2025-07-11 07:13 GMT
Ordinance for 42% BC reservations

తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ జారీచేయాలన్న క్యాబినెట్ నిర్ణయం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. స్ధానికఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయటం ఎలాగ అన్న విషయమై కొంతకాలంగా ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం అనేకరకాల కసరత్తులు చేస్తోంది. ఇన్ని కసరత్తులు ఎందుకు చేస్తోందంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రింకోర్టు తీర్పు ఉందికాబట్టే. సుప్రింకోర్టు తీర్పుప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) అమలుచేయటం సాధ్యంకాదు. అందుకనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని అసెంబ్లీలో తీర్మానంచేయించి దాన్ని గవర్నర్ దగ్గరకు పంపింది ప్రభుత్వం. గవర్నర్ సంతకం అవ్వగానే ఆ బిల్లును రాష్ట్రపతికి చేరుకున్నది.

రేవంత్ పంపిన రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగులో ఉంది. ఈబిల్లుకు ఎన్డీయే(NDA Government) ప్రభుత్వం ఇప్పట్లో ఆమోదంలభించే అవకాశాలు కనబడటంలేదు. ఇంతలోనే సెప్టెంబర్ 30వ తేదీలోగా స్ధానికసంస్ధల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. ఇదేసమయంలో తమకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయల్సిందే అని బీసీ సంఘల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లకవిత కూడా పదేపదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏమిచేయలనే విషయమై గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశం చర్చించింది.

సుదీర్ఘచర్చ తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు ముందుగా పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని డిసైడ్ చేసింది. సవరణలు తెచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ఇష్యూ చేయటం ద్వారా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ తాజా నిర్ణయం ప్రకారం బీసీలకు 42శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు అంటే మొత్తం రిజర్వేషన్లు 70 శాతం అవుతుంది. మరి రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టుతీర్పు సంగతి ఏమిటనే చర్చ పెరిగిపోతోంది. సుప్రింకోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం 70శాతం రిజర్వేషన్లను అమలుచేయటం సాధ్యమేనా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ఓట్లు సాధించుకోవటమే టార్గెట్ గా రేవంత్ అప్పట్లో నోటికొచ్చిన హామీ ఇచ్చేశాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు ఆచరణసాధ్యంకాదని రేవంత్ తో పాటు బీసీ సంఘాలు, మేథావులకు కూడా బాగా తెలుసు. అయినా సరే అప్పటికే కేసీఆర్ పాలనపై మండిపోతున్న బీసీలు రేవంత్ హామీని నమ్మినట్లుగానే కాంగ్రెస్ కు ఓట్లేశారు. ఆచరణసాధ్యంకాని హామీ ఇచ్చిన విషయం రేవంత్ కు బాగా తెలుసు కాబట్టే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ ఎక్కడా 42శాతం రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకురాలేదు. అయితే రేవంత్ ను ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు, కులసంఘాలు పదేపదే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలును డిమాండ్ చేస్తునే ఉన్నాయి. ఒకదశలో చట్టప్రకారం 42శాతం రిజర్వేషన్లు సాధ్యంకాదు కాబట్టి పార్టీపరంగా అమలుచేయాలని కూడా రేవంత్ అనుకున్నారు. అయితే తెరవెనుక ఏమి జరిగిందో అర్ధంకావటంలేదు అర్జంటుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ జారీచేయాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది. క్యాబినెట్ అయితే ఆర్డినెన్స్ జారీచేయాలని నిర్ణయించింది కాని తొందరలో జారిఅవబోయే ఆర్డినెన్స్ కోర్టులో నిలుస్తుందా ? ఈసందేహాలపై నిపుణులు ఏమన్నారో చూద్దాం.

ఆర్డినెన్స్ నిలవదు : చిరంజీవి

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేథావుల వేదిక ఛైర్మన్ తొగరాల చిరంజీవి ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఆర్డినెన్స్ నిలబడదు అన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో సవాలు చేస్తే ఆర్డినెన్స్ ను కోర్టు కొట్టేస్తుంద’’ని చెప్పారు. ‘‘2018లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసి’’న విషయాన్ని చిరంజీవి గుర్తుచేశారు. ‘‘హైకోర్టు తీర్పును అప్పటి ప్రభుత్వం సుప్రింకోర్టులో చాలెంజ్ చేసినా ఉపయోగం లేకపోయింద’’న్నారు. ‘‘అందుకనే బీసీలకు 22 శాతం రిజర్వేషన్లతోనే కేసీఆర్(KCR) ప్రభుత్వం స్ధానికఎన్నికలు జరిపింద’’ని తెలిపారు. ‘‘రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదింపచేసుకుని 9వ షెడ్యూల్ లో పెట్టించటం ఒక్కటే రిజర్వేషన్లు పెంచుకునేందుకు మార్గమ’’ని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఈమధ్యనే నిర్వహించిన కులగణన, జనగణనలు కోర్టులో నిలబడవని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం ఉండదు : కొండలరావు

‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలన్న రేవంత్ క్యాబినెట్ నిర్ణయం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండద’’ని హైకోర్టు అడ్వకేట్ కొండలరావు చెప్పారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ జారీచేయాలన్న క్యాబినెట్ నిర్ణయం కేవలం కంటితుడుపు చర్యమాత్రమే’’ అన్నారు. ‘‘పార్లమెంటులో బిల్లు నెగ్గకుండా, 9వ షెడ్యూల్ లో చేర్చకుండా రిజర్వేషన్ల పెంపుసాధ్యంకాదన్న విషయం అందరికీ తెలుస’’ని చెప్పారు. ‘‘ప్రభుత్వం తీసుకురాబోతున్న ఆర్డినెన్స్ కోర్టులో నిలబడదన్న విషయం రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుస’’ని అడ్వకేట్ అభిప్రాయపడ్డారు. ‘‘2023 ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన రేవంత్ కు, కులసంఘాలకు కూడా 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యంకాదన్న విషయం బాగా తెలుస’’ని చెప్పారు. ‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలులోకి రావాలంటే రాష్ట్రప్రభుత్వం, రాజకీయపార్టీలు, కులసంఘాలు ఏకతాటిపైన నిలబడల’’న్నారు. ‘‘అందరు కలిసి ఢిల్లీకి వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపి తెలంగాణ అవసరాలను తెలియచేసి బిల్లును పార్లమెంటులో పెట్టించటం ద్వారా మాత్రమే విజయం సాధించగలర’’ని చెప్పారు. ‘‘ఎంతమంది న్యాయనిపుణులతో ప్రభుత్వం మాట్లాడినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కోర్టులో నిలవద’’ని కొండలరావు గట్టిగా చెప్పారు.

Tags:    

Similar News