KCR and Cases|కేసీఆర్ కు ఇంకా టైమ్ ఉందా ?
రిపోర్టుమీద చర్యలు తీసుకునేముందు న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని మంత్రివర్గం డిసైడ్ చేసింది.;
కేసులు, విచారణలు ఎదుర్కునేందుకు కేసీఆర్ కు ఇంకా చాలాసమయం పట్టేట్లుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కొడుకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పోటాపోటీగా ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ) కేసులుపెట్టి విచారించేందుకు నోటీసులు జారీచేశాయి. 6వ తేదీ సోమవారం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వాల్సుండగా 7వ తేదీన ఈడీ విచారణకు హాజరవ్వాలి. మరి రెండు విచారణలకు కేటీఆర్(KTR) హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగామారింది. విచారణకు హాజరైతే ఏమి జరగుతుందన్నది చూడాలి. ఈవిషయాన్ని పక్కనపెట్టేస్తే పార్టీ అధినేత కేసీఆర్(KCR) విషయమై ఇఫుడు చర్చ మొదలైంది. అదేమిటంటే విద్యుత్ కొనుగోళ్ళు, ప్లాంట్ల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
చత్తీస్ ఘడ్(Chhattisgarh) నుండి విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో తెలంగాణా ప్రభుత్వంపై సుమారు రు. 3,642 కోట్ల అదనపు భారంపడినట్లు ఆరోపణలున్నాయి. అలాగే భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో ప్రభుత్వంమీద వేలాది కోట్ల రూపాయల భారపడిందన్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రభుత్వం జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్(Madan B Lokur Commission) తో విచారించింది. ఆ రిపోర్టును లోకూర్ ప్రభుత్వానికి సమర్పించి సుమారు రెండువారాలైంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో లోకూర్ సమర్పించిన నివేదికపై రేవంత్(Revanth) మంత్రివర్గ సహచరులతో చర్చించినట్లు సమాచారం. రిపోర్టుమీద చర్యలు తీసుకునేముందు న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని మంత్రివర్గం డిసైడ్ చేసింది. అందుకనే రిపోర్టును అడ్వకేట్ జనరల్ కు పంపబోతున్నారు.
అసలు ఆరోపణలు ఏమిటి ?
ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తెలంగాణా ప్రభుత్వంపై సుమారు రు. 3,642 కోట్ల భారంపడింది. అలాగే కాలంచెల్లిన టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రాబోయే 25 ఏళ్ళల్లో ప్రభుత్వంపై 9 వేల కోట్లరూపాయల భారంపడినట్లు సమాచారం. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా వేలాది కోట్లరూపాయలు ప్రభుత్వంపై అదనపు భారంపడిందని లోకూర్ విచారణలో తేలింది. కేసీఆర్ పదేళ్ళ హయాంలో విద్యుత్ రంగంలో పనిచేసిన ఉన్నతాధికారులు, విద్యుత్ రంగంలో నిపుణులను లోకూర్ కమిషన్ విచారించింది. విద్యుత్ ఒప్పందాల కారణంగా తెలంగాణా ఏ విధంగా నష్టపోయింది ? రాష్ట్రంపై అదనపు భారం ఎలా పడబోతోందనే వివరాలను విచారణముందు హాజరైన వాళ్ళంతా అఫిడవిట్లు దాఖలు చేశారు. అఫిడవిట్లలో , విచారణ సందర్భంగా ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగానే లోకూర్ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని నిర్ధారించి రిపోర్టు అందించారు.
కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలన్న నిర్ణయం తీసుకోవటానికే ప్రభుత్వానికి చాలా కాలంపట్టింది. అవినీతి జరిగిందని చీఫ్ సెక్రటరీ అంతర్గత విచారణలో నిర్ధారణ అయిన తర్వాత కేటీఆర్ మీద కేసుపెట్టి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma) కు ప్రభుత్వం లేఖ రాసింది. గవర్నర్ దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రావటానికే సుమారు నెలన్నర రోజులు పట్టింది. తర్వాత క్యాబినెట్ నుండి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వెళ్ళాయి. చీఫ్ సెక్రటరీ నుండి ఏసీబీకి సమాచారం అంది కేసునమోదు చేయటానికి వారంరోజులు పట్టింది. మంత్రిగా పనిచేసి ఎంఎల్ఏగా ఉన్న కేటీఆర్ మీద కేసుపెట్టి విచారణకు నోటీసులు జారీచేయటానికి పట్టిన సమయమే కేసీఆర్ విషయంలో కూడా తప్పదని అర్ధమవుతోంది. ముఖ్యమంత్రి, మంత్రిగా పనిచేశారన్న తేడా లేదుకాని ఇద్దరు ఎంఎల్ఏలు. కేటీఆర్ మీద కేసుపెట్టి విచారణ జరపమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి గవర్నర్ సుమారు నెలన్నర సమయం తీసుకున్నారు. మరి కేసీఆర్ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే ఇంకెంత సమయం తీసుకుంటారో చూడాలి.
అందుకనే కేసీఆర్ మీద చర్యలు తీసుకునే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరపడటంలేదు. ఏమాత్రం తొందరపడినా ఎక్కడో తప్పులు జరిగి కోర్టులో కేసులు వీగిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకనే ఏమాత్రం తొందరలేకుండా అడ్వకేట్ జనరల్ సలహా తీసుకునే కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవటంలో ముందుకు వెళ్ళాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. మరి నిర్ణయం తీసుకుని యాక్షన్ తీసుకునేందుకు ఎంతసమయం పడుతుందో చూడాల్సిందే.