కేసీఆర్ క్యాంపెయిన్ ని ప్రజలు నమ్ముతారా?

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెప్పే అంశాలను ప్రజలు నమ్ముతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Update: 2024-03-27 16:04 GMT
కేసీఆర్

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను స్పీడ్ అప్ చేశాయి. మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్, ప్రచార కార్యక్రమాలకి రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తోంది. ఇప్పటికే ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వివిధ సంఘాల వారితో భేటీ అవుతూ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగిస్తున్నారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ ఉగాది తర్వాత నుండి భారీ బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇటీవల పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ అధినేత కేసీఆర్ కి మింగుడు పడనివ్వడం లేదు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఏడెనిమిది సీట్లు గెలుచుకోవాలని, తద్వారా కాంగ్రెస్ గెలుపు గాలివాటం అని నిరూపించాలని భావిస్తున్నారు. అందుకోసం ఎన్నికలు ముగిసేవరకు జనంలోనే ఉండాలని, విస్తృత ప్రచారం చేయాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అమలు కాని హామీలను, వైఫల్యాలను ఎత్తి చూపేలా ద్విముఖ విధానంతో ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. ఉగాది తర్వాత నుండి భారీ బహిరంగ సభలు, బస్సు యాత్రలతో రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సభలలో కేసీఆర్ కూడా పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, కేసీఆర్ కి మాటల మాంత్రికుడు అని పేరు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు పర్యాయాలు పార్టీ విజయానికి ఆయన ప్రసంగాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఆయన ప్రసంగానికి ఒళ్ళు నిక్కబొడుచుకుని మన తెలంగాణ కోసం మన టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీ అనే సెంటిమెంట్ తో ప్రజలు ఓట్ల వర్షం కురిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మళ్ళీ రాష్ట్రం కోసం మా పార్టీ చాలా చేసింది, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది అని చెబితే ప్రజలు నమ్ముతారా? అంటే కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోలేదు...
పొలిటికల్ అనలిస్ట్ తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి. కేశవులు నేత 'ది ఫెడరల్' తో మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం అనే నినాదంతో ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారని ప్రజలు భావించారు. కేసీఆర్ అహంకార ధోరణి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. మూడు నెలల్లోనే ఆయనపై, పార్టీపై వ్యతిరేకత తగ్గి కేసీఆర్ చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. కేసీఆర్ ఫ్యామిలీపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రజలు నమ్ముతున్నారు. పార్లమెంటు ఎన్నికలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకునే అవకాశమే లేదు" అని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కి నిరాశే...
"కేసీఆర్ పటిష్టమైన పార్టీ నిర్మాణం చేయడంలో విఫలం అయ్యారు. పార్టీని బలోపేతం చేసే నాయకుల్ని పైకి తీసుకురాలేదు. ఒక నియంతలా పార్టీని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. అసంతృప్తిని చెప్పుకునే అవకాశం కల్పించలేదు. ప్రగతి భవన్ లో ఎంట్రీకి మంత్రులు, ఎమ్మెల్యేలకే అవకాశం లేకుండా పోయింది. ఇక సామాన్యులు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది? మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన ఎలా అయితే నియంతలా వ్యవహరించారో నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు కూడా అలానే వ్యవహరించారు. ఆయనను చూసి ప్రజలు ఓట్లు వేస్తారు అని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన ప్రతి పథకం ఓట్లు కురిపించే ఓటు బ్యాంకులానే చూశారు. చట్టం చేసే హక్కు వారికి ఉండొచ్చు కానీ వాటి అమలు ప్రభుత్వ అధికారుల ద్వారా జరగాలనే విషయం పక్కన పెట్టేశారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వంటి పథకాల బాధ్యత ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు అప్పజెప్పారు. దీంతో ఎమ్మేల్యేలు తమ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం, అవినీతికి పాల్పడటం లాంటివి జరిగాయి. ఇవన్నీ ప్రజలు గమనించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే జరగబోతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటుంది. తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి కాంగ్రెస్ శ్రేణులు బలంగా తీసుకెళ్లగలగాలి. అలాగే తాము అధికారంలోకి వస్తే కులగణన, సమగ్రకుటుంబసర్వే చేయిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ అంశాన్ని కూడా ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించాలి. ఇది కాంగ్రెస్ కి మరింత మైలేజ్ పెంచుతుంది" అని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములు ది ఫెడరల్ తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కేసీఆర్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు...
రాష్ట్రంలో కేసీఆర్ మాటలు మళ్ళీ నమ్మే పరిస్థితి లేదని, 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన చెబితే హాస్యాస్పదంగా ఉంటుందని శాస్త్రవేత్త, ఆర్థికవేత్త పొలిటికల్ అనలిస్ట్ డా. జానయ్య అన్నారు. "బీఆర్ఎస్ తమ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసింది. విద్య, వైద్య, వ్యవసాయ, రెవెన్యూ వ్యవస్థల్ని విధ్వంసం చేసింది. ప్రజల స్వేచ్ఛని హరించారు. పోరాడి సాధించిన తెలంగాణలో ఆందోళనలు చేస్తే హౌజ్ అరెస్టులు చేయించారు. ఇదే పరిస్థితి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉంటే, అప్పటి నాయకులు ఆందోళనలు చేయకుండా కట్టడి చేసి ఉంటే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యేదా? రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కష్టం. కానీ ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజల స్వేచ్ఛని హరించారు అనడానికి అతి పెద్ద ఉదాహరణ. తెలంగాణ అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో ఉందని పార్టీ ముఖ్య నేతలు పదే పదే చెబుతున్నారు. అలాంటప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ 21 వ స్థానంలో ఎందుకు ఉంది? ఆదాయం ఎటు మళ్ళుతుంది? మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఎందుకు అప్పులు పాలయ్యింది. కేసీఆర్ ఫ్యామిలీ, వారి పార్టీ నాయకులు అవినీతి చేశారా? అనే లాజికల్ ప్రశ్న రైజ్ అవుతుంది కదా. కవిత లిక్కర్ స్కాం కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా. ఇండియా కూటమిని దెబ్బ తీయాలంటే బలమైన నేత అయిన కేజ్రీవాల్ ని ప్రచారంలో పాల్గొనకుండా చెయ్యాలి. అందుకే కవితని ఎరగా వేసి కేజ్రీవాల్ అరెస్టుకు తెరలేపారు. కవిత అరెస్ట్ ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు? బీజేపీ తో ఉన్న ఫ్రెండ్షిప్ వలనే కదా. కేసీఆర్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. గెలుపు కాంగ్రెస్ ఖాతాలో పడినప్పటికీ ఇది ప్రజల్లో ఆయనపై ఉన్న వ్యతిరేకత వలనే జరిగింది. కాంగ్రెస్ ఇప్పుడు పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి గురించి చెబుతూ అప్పుల రాష్ట్రాన్ని చేతిలో పెట్టినప్పటికీ ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నమని ప్రజలకి చెప్పాలి. ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అమలు చేశారు. గృహజ్యోతి లో ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. మిగిలినవి అమలు చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది లేట్ అవ్వొచ్చు. 100 రోజుల్లో అమలు చేయలేకపోయారని కేసీఆర్ ప్రశ్నిస్తే ప్రజలు పదేళ్లలో మీరేం చేశారు అని ప్రశ్నిస్తారు. ఐదేళ్ల టైం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అవన్నీ ఐదేళ్లలో అమలు చేస్తామని ప్రజలకి నమ్మకం కలిగిస్తే కాంగ్రెస్ కచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలకు పైగా గెలుస్తుంది" అని జానయ్య.. ది ఫెడరల్‌తో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Tags:    

Similar News