సెప్టెంబర్ 10 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్

మంత్రి కోమటిరెడ్డి వెల్లడి;

Update: 2025-08-31 15:27 GMT

సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సూచనా ప్రాయంగా చెప్పారు. కోమటి రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక సంస్థలకు రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి.తొలివిడతలో ఎంపీటీసీ, జడ్ పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది.

కోమటి రెడ్డి ప్రకటనతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆమోదం పొందిన బిల్లును శానన మండలిలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. జడ్ పిటిసి, ఎంపీటీసీ సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఎన్నికల ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. 6, 7 వ తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమై అభ్యంతరాలను ఎన్నికల సంఘం స్వీకరిస్తుంది. 8, 9 తేదీల్లో ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 10వ తేదీనాటికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమౌతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో పాలక మండళ్లు నిర్వీర్యమయ్యాయి. గ్రామీణాభివృద్ది ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ది కుంటుపడింది. దీంతో తిరిగి నిధులు రాబట్టాలంటే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News