హెచ్‌సీయూకి సెంట్రల్ ఎంపవర్ కమిటీ..

ఈ కమిటీ పనేంటి..!;

Update: 2025-04-10 08:26 GMT

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం జాతీయ స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు దగ్గరుకు కూడా చేరుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ భూముల్లో ఎటువంటి పనులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భూములను పరిశీలించడానికి కేంద్రం నుంచి పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ గచ్చిబౌలికి చేరుకుంది. ఈ కమిటీ అక్కడ ఉన్న భూములను పరిశీలించి.. పూర్తి వివరాలతో సుప్రీంకోర్టుకు నివేదికను అందజేయనుంది.

సుప్రీంకోర్టు ఏమందంటే..

కంచె గచ్చిబౌలి వ్యవహారంలో సీఎస్‌ను ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. అదే విధంగా ఆఘమేఘాలపైన అక్కడ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ 400 ఎకరాలు అటవీ భూమి కాకపోయినా.. భారీ ఎత్తున చెట్లు కొట్టేయడానికి సీఎస్ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. గచ్చిబౌలి భూముల్లో పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఆ ప్రాంతంలో విస్తృతంగా వృక్షసంపద నిర్మూలన జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. దాదాపు 100 ఎకరాలను డెవలప్‌మెంట్‌కు సిద్ధం చేసేటంత యంత్ర సముదాయం అక్కడ మోహరించి ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులను అక్కడ ఉన్న వన్యప్రాణులను ప్రభావితం చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. 1932 నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆరు నెలల్లోగా ఆ ప్రాంతంలో పరిశీలన అంచనా పనులను పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది.

అసలు ఈ ఎంపవర్ కమిటీ అంటే ఏంటో తెలుసా..

ఒక సమస్యను పరిష్కరించడానికి, ప్రజల సాధికారత కోసం ఏర్పాటు చేసే కమిటీని ‘ఎంపవర్ కమిటీ’ అంటారు. ఒక ప్రత్యేక పనిని చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యక్తులు, బృందాలకు ప్రత్యేక అధికారం కల్పిండం వంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఎంపవర్ కమిటీలు, ఏదైనా ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడం, లేదా ప్రజల జీవితాలను మెరుగుపరచడం, లేదా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడం వంటివి చేయటానికి ఏర్పాటు చేస్తారు. తీవ్రతరమైన సమస్యలను పరిష్కరించడానికి నిపుణులతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. హెచ్‌సీయూ వివాదం తీవ్రంగా మారుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఈ అంశంలోకి ఈ కమిటీ రంగంలోకి దిగింది.

Tags:    

Similar News