రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత
తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న రచయిత్రి అనిశెట్టి రజిత గుండెపోటుతో వరంగల్ లో తుదిశ్వాస విడిచారు.;
తెలంగాణ సాహితీ లోకం మరో రచయిత్రిని కోల్పోయి శోకసముద్రంలో మునిగింది. ప్రముఖ రచయిత్రి , ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత వరంగల్ నగరంలో సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం రజితకు గుండెపోటు రాగా, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. హన్మకొండలోని కుమార్పల్లి ఆమె వూరు. 14, ఏప్రిల్, 1958 రోజున జన్మించారు. అనిశెట్టి బాలరాజు, అమ్మ జయలక్ష్మి తల్లితండ్రులు.
1977లో వరంగల్‍లో ‘చైతన్య సాహితి’ లో వ్యవస్థాపనతో ఆమె సాహిత్యప్రస్థానం ఒక మలుపు తిరిగింది. “అప్పటి నుండీ ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆనాటి సుప్రసిద్ధ కవులు, రచయితలు పరిచయం, వారి ప్రసంగాలు వినడం, తరవాత సాంస్కృతిక సమాఖ్య, శ్రీలేఖ సాహితి.. ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాహిత్య సదస్సులూ, ఉత్సవాల్లో పాల్గొనడం ఈ విధంగా సాహిత్యాభిరుచి పెరుగుతూపోయింది. ఒకవైపు చైనా, రష్యా, లాటిన్ అమెరికాల అనువాద సాహిత్యం, అభ్యుదయ, హేతువాద, విప్లవ సాహిత్యం చదవడం, మన తెలుగు కవుల కవితా సంపుటాలు చదవడం నాలో కవిత్వ, సాహిత్య పిపాస ఎక్కువవుతూపోయింది. నిజానికి పుస్తకాలే నాకు మంచి నేస్తాలుగా మారాయి. సాహిత్యంలోని సృజనశక్తి విలువ తెలుసొచ్చింది. సామాజిక ఉద్యమ సాంగత్యం సాహిత్యానికి మరింత చేరువ చేసింది. నా కలం పాళి ‘అగ్నిపాళి’గా మారిపోయింది. అప్పట్లోనే మా కుటుంబంలో ఒక పాపకు ‘సృజన’ అని పేరు పెట్టుకున్నాము. మన సమాజంలో ఆస్తులకు ఉన్నట్లే కళలకూ, వ్యాపారాలకూ, జ్ఞానానికీ వారసులుంటారు, వారసత్వ సమాజం కదా. నిజానికి శ్రామిక కులం, వర్గంలో పుట్టిన నాకు సాహిత్యానికి సంబంధించి ఎలాంటి శిక్షణ, మార్గదర్శకత్వం గానీ, వారసత్వం గానీ లేదు,”అని ‘కొలిమి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.