తెలంగాణను వీడని వరద విపత్తు..పలు ప్రాంతాలు అతలాకుతలం

గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణను వరద విపత్తు వీడటం లేదు.;

Update: 2025-08-31 00:15 GMT
శ్రీరాంసాగర్ జలాశయంలోకి చేరిన వరదనీరు

తెలంగాణ రాష్ట్రాన్ని వరద విపత్తు వీడటం లేదు. గోదావరి ఎగువ పరివాహక ప్రాంతాలు, మహారాష్ట్రలో భారీవర్షాల వల్ల వరదనీరు గోదావరిలో పోటెత్తుతోంది. దీంతో గోదావరి వరదనీటితో ఉగ్రరూపం దాల్చింది. నిర్మల్ జిల్లా బాసర, మంచిర్యాల జిల్లా మంచిర్యాల ప్రాంతాల్లో గోదావరి వరదనీరు జనవాసాలను ముంచెత్తింది. మరోవైపు మెదక్ జిల్లాను వరదలు వణికిస్తున్నాయి.


శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు
గోదావరి ఎగువ పరివాహక ప్రాంతంలో నిరంతర వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి భారీగా వరదనీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్థి స్థాయి జలాశయ నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్థుతం 1084.5 అడుగుల మేరకు నీరు చేరిందని ఎస్ఆర్ఎస్ పీ చీఫ్ ఇంజినీరు టి వినయ్ కృష్ణారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రాజెక్టు ఉన్న పోచంపాడు వద్ద వరద పరిస్థితిని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. వరదనీటిమట్టం గంటగంటకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. శనివారం ఒక్క రోజే ప్రాజెక్టు జలాశయంలోకి 4.90 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చింది.



 దిగువకు వరదనీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు 39 ప్రాజెక్టు వరదగేట్లు తెరచి దిగువకు నీటిని వదులుతున్నారు. వరద కాల్వ, కాకతీయ, సరస్వతి, లక్ష్మీ ప్రధాన కాల్వల ద్వారా 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరదనీటి ఇన్ ఫ్లోను నియంత్రించేందుకు దిగువకు వరదనీటిని విడుదల చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. వరద పోటెత్తిన గోదావరిలోకి చేపలు పట్టడానికి, ఈత కొట్టడానికి రావద్దని ఆయన కోరారు. కోడిచెర్ల, చక్ర్యాల్, సావెల్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల గ్రామాల సమీపంలో గోదావరి నది వైపు ప్రజలు రావద్దని ఆయన ఆదేశించారు.



 బాసర వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి

నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గోదావరి ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా నదీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో బాసర వద్ద నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వరద పరిస్థితిని పరిశీలించారు. గోదావరి నదీ నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చెప్పారు.



 దెబ్బతిన్న పంటల పరిశీలన

బాసర మండలం బిద్రెల్లి గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న సోయా పంటలను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు.క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించిన కలెక్టర్, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గోదావరి వరదల వల్ల జరిగిన నష్టాన్ని అధికారులతో కలిసి పరిశీలించి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.



 వరద మరమ్మతు పనులు

కామారెడ్డి వరద విపత్తు వల్ల నష్టపోయిన వారికి అధికారులు తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.వరదల వల్ల దెబ్బతిన్న చెరువులు, ప్రాజెక్టులు, కాల్వల మరమ్మతు పనులు చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో 12 వార్డుల్లో మంచినీటి సరఫరాను పునరుద్ధరించారు.వరద ప్రభావిత ప్రాంతాల్ల త్వరలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చెప్పారు.



 అప్రమత్తంగా ఉండాలి

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టును, అమ్మవారి ఆలయ ప్రాంగణం నుంచి ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హవేలీ ఘన్పూర్ మండలం వాడి రాజపేట్ రహదారి మధ్యలోని పెద్ద వాగు ప్రవాహం వల్ల దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.

దెబ్బతిన్న కల్వర్టులకు మరమ్మతులు
హవేలీ ఘన్పూర్ మండలం రాజిపేట్ నుంచి కప్రాయపల్లి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన ప్రాంతానికి కలెక్టర్ రాహుల్ రాజ్ ద్విచక్ర వాహనం పై వెళ్లి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. హవేలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టు మరమ్మతు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కలెక్టరు రాహుల్ రాజ్ హవేలీ ఘన్పూర్ మండలం వాడి రాజపేట్ రహదారి మధ్యలోని పెద్ద వాగు ప్రవాహం వల్ల దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.


Tags:    

Similar News