SC classification |ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్‌కు వినతుల వెల్లువ

ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ కు సోమవారం వినతులు వెల్లువెత్తాయి.డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ కు 59 కులాల ప్రతినిధులు కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

Update: 2024-12-02 13:10 GMT

షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ హైదరాబాదులోని బూర్గుల రామకృష్ణారావు భవనం కేంద్రంగా నవంబర్ 11వ తేదీ నుంచి క్రియాశీలకంగా పని చేస్తుంది.

- షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ కు సోమవారం పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి.
- కమిషన్ ఏర్పాటు అయిన తేదీ మొదలు షెడ్యూల్డ్ కులాల్లోని 59 కులాలకు చెందిన వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు,నాయకులు,ప్రజలు కార్యాలయానికి వచ్చి కమిషన్ ను కలిసి తమ కులం, విద్య, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకబడిన విషయాన్ని విన్నవించారు. రాతపూర్వకంగా విజ్ఞప్తులను అందజేశారు.

10 షెడ్యూల్డ్ కులాల్లోని మాల, మాదిగ కుల ప్రతినిధులతో పాటు, అల్పసంఖ్యాక కులాలైన మాదాసి కురవ, కొలుపుల, మాల జంగమ, చిందు, బేడ/బుడగ జంగమ, బైండ్ల , మాంగ్, అరుంధతీయ,మిత అయ్యల్వార్ మొదలగు వాటికి చెందినటువంటి వంద మందికి పైగా ప్రతినిధులు జస్టిస్ షమీం అక్తర్ ను కలిశారు. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై వారి అభిప్రాయాలను తెలిపారు. తమ తమ కులాల వెనుకబాటుతనాన్ని, విద్య, ఉద్యోగాల సాధనలో రిజర్వేషన్ పొంది లబ్ది పొందడంలో తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ రాతపూర్వకమైన విజ్ఞప్తులను అందించారు.

చిందు కులస్థుల కళాజాత
ఈ సందర్భంగా చిందు కులం వారు తమ కులవృత్తి అయిన భాగోతాలకు చెందిన ఒక చిన్న కళాజాతను కమిషన్ ఛాంబరులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయా కులాల ప్రతినిధులతో జస్టిస్ షమీం అక్తర్ మాట్లాడారు. వినతిపత్రాలను కూలంకషంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదికను అందజేస్తానని షమీంఅక్తర్ చెప్పారు. ఈ నెల నుంచి వివిధ జిల్లాల్లో కమిషన్ పర్యటించి, ప్రజలను స్థానికంగా కలిసి, వారి నుంచి అర్జీలను స్వీకరిస్తుందని తెలిపారు. మొదటగా సంగారెడ్డి జిల్లా పర్యటన ఈనెల నాలుగో తేదీన ఖరాయినట్లు కూడా తెలిపారు.


Tags:    

Similar News