Guvvala joins BJP | బీజేపీ గూటికి చేరిన గువ్వల...

తెలంగాణలో పార్టీబలోపేతానికి గువ్వల సేవలు ఉపయోగపడతాయని అద్యక్షుడు ఆకాంక్షించారు.;

Update: 2025-08-10 07:38 GMT
Guvvala Balaraju joins BJP

అచ్చంపేట నుండి రెండుసార్లు బీఆర్ఎస్ ఎంఎల్ఏగా గెలిచిన గువ్వల బాలరాజు(Guvvala Balaraju) ఆదివారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు(BJP President Ramachandra Rao) కండువా కప్పి గువ్వలను పార్టీలోకి ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన మద్దతుదారులు కూడా బీఆర్ఎస్(BRS) ను వదిలేసి కమలంపార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతు బీజేపీ(Telangana BJP)కి జనాల్లో పెరుగుతున్న ఆధరణ, నరేంద్రమోదీ(Narendra Modi) ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాలకు ఆకర్షితులై గువ్వల పార్టీలో చేరటం సంతోషమన్నారు. తెలంగాణలో పార్టీబలోపేతానికి గువ్వల సేవలు ఉపయోగపడతాయని అద్యక్షుడు ఆకాంక్షించారు.

బీఆర్ఎస్ లో చాలాకాలం ఉన్న గువ్వల పార్టీకి రాజీనామా చేయటం ఆశ్చర్యం కలిగించింది. రాజీనామా చేసిన తర్వాత గువ్వల పార్టీతో పాటు అధినేత కేసీఆర్ పై అనేక ఆరోపణలు చేశారు. తనను పార్టీ పట్టించుకోలేదన్నారు. కష్టకాలంలో తాను పార్టీకి అండగా ఉంటే 2023 ఎన్నికల్లో పార్టీ నేతలే తన ఓటమికి కారణమైనట్లు మండిపడ్డారు. పార్టీలో తనకు ఎదురవుతున్న సమస్యలగురించి కేసీఆర్ తో చెప్పినా అధినేత పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరిన తర్వాతే తనకు సమస్యలు మొదలైనట్లుగా ఆరోపించారు. పార్టీలో తనను పట్టించుకోవటంలేదు కాబట్టే బీఆర్ఎస్ ను వదిలేయాలని డిసైడ్ అయినట్లు బాలరాజు చెప్పారు.

రామచంద్రరావు మాట్లాడుతు బీఆర్ఎస్ నుండి తమపార్టీలోకి రావటానికి ఐదుమంది ఎంఎల్ఏలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎంఎల్ఏలతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు. అన్నీ వివరాలను తొందరలోనే చెబుతానని కూడా అన్నారు. రామచంద్రరావు చెప్పినట్లుగా ఐదుగురు ఎంఎల్ఏలు బీజేపీలో చేరుతారా అన్నది పక్కనపెట్టేద్దాం. బీఆర్ఎస్ ను వదిలేయటానికి కొందరు నేతలు రెడీ అవుతున్నారనే ప్రచారమైతే జరుగుతోంది. కారణం ఏమిటంటే అన్నీవైపుల నుండి కారుపార్టీని సమస్యలు కమ్ముకుంటున్నాయి.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ ఇంతవరకు అదికారికంగా మాట్లాడలేదు. సోమవారం కరీంనగర్లో జరగబోయే బహిరంగసభలో బీసీ రిజర్వేషన్లపై ప్రకటనచేస్తారని అంటున్నారు. అలాగే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ రంగంలో అవినీతి, ఫార్ములా కార్ రేసు కేసులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ ను బాగా ఇరుకునపెడుతున్నాయి. వీటిల్లో నుండి బయటపడటం కల్వకుంట్ల ఫ్యామిలీకి అంత వీజీకాదు. మరోవైపు పార్టీలోనే కేసీఆర్, కేటీఆర్ కు కవిత బల్లెమైకూర్చుంది. ఇలాంటి సమస్యల్లో నుండి పార్టీ బయటపడటం కష్టమనే అభిప్రాయం పార్టీ నేతల్లో పెరుగుతోంది. అందుకనే ఎవరికి అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీలో చేరటానికి నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. గువ్వల ఈరోజు బీజేపీలో చేరటం ఇందులో భాగమనే అనుకోవాలి. తొందరలోనే ఇంకెంతమంది నేతలు బయటకు వచ్చేస్తారో చూడాలి.

Tags:    

Similar News