గుమ్మడి నిరీక్షణ ఫలించింది..

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ను గుమ్మడి నరసయ్య మర్యాదకపూర్వకంగా కలిశారు. పలు అంశాలకు సంబంధించి వినతి పత్రాలను సీఎంకు అందించారు.;

Update: 2025-03-18 09:39 GMT

సీఎంను కలవాలన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నిరీక్షణ నెరవేరింది. పలు అంశాలపై చర్చించడానికి సీఎంను కలవాలని గుమ్మడి నరసయ్య ఫిబ్రవరి నెల 21 తేదీన సీఎం ఇంటికి చేరుకున్నా.. గంటల తరబడి ఆయన ఎండలో నిలబడే ఉన్నారు తప్పితే సీఎంను కలవలేకపోయారు. సీఎం బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని, అపాయింట్‌మెంట్ దొరకదంటూ అధికారులు ఆయనను వెనక్కు పంపేశారు. నాలుగు రోజులు ప్రయత్నించినా గుమ్మడి నరసయ్యను సీఎం కలవకపోవడం, తీరా ఫిబ్రవరి 21న ఆయనను గంటలతరబడి ఎండలో నిల్చుని ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషయం మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చిందంటే.. మంగళవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ను గుమ్మడి నరసయ్య మర్యాదకపూర్వకంగా కలిశారు. పలు అంశాలకు సంబంధించి వినతి పత్రాలను సీఎంకు అందించి.. సమస్యను వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే గుమ్మడి నరసయ్యను సీఎం కలవకపోవడంపై ఇటీవల అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఈ వియంపై సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిన గుమ్మడి నరసయ్యను సీఎం ఎందుకు కలవలేదు? అపాయింట్‌మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? అని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. గుమ్మడి నరసయ్యలాంటి నాయకుడు వస్తే.. కలవలేకున్నాన్న సమాచారం కూడా ఇవ్వకుండా బయట ఎండలో నిల్చోబెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా కూనంనేని అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమచ్చారు.

‘‘గుమ్మడి నరసయ్య అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. ఆయన విషయంలో జరిగిన విషయం చాలా బాధించింది. అది అనుకోకుండా జరిగిన అంశమే కానీ మరొకటి కాదు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తర్వాత తనకు విషయం తెలిసింది. వెంటనే ఆఫీసు నుంచి ఆయనకు ఫోన్ చేయించాను. కానీ అప్పటికే ఖమ్మం చేరుకున్నట్లు గుమ్మడి నరసయ్య చెప్పారు. తర్వాత కలుస్తానని ఆయన చెప్పారు’’ అని అన్నారు. అదే విధంగా తనను కలవడానికి వచ్చే నేతలు ఇకపై సాయంత్రం సమయంలో రావాలని సూచించారు.

Tags:    

Similar News