సూర్యాపేట సూపర్ స్టార్.. సక్సెస్ స్టోరీ ఇది...
పట్టుదల, అంకితభావంతో కష్టపడి చదివి సక్సెస్ సాధించిన తెలంగాణ గ్రామీణ పేద యువకుడి నిజ జీవిత విజయయాత్ర.;
By : Saleem Shaik
Update: 2025-07-22 02:47 GMT
ఇదీ ఖరగ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లోని నేతాజీ ఆడిటోరియం...2025 జులై 15వతేదీన జరగిన 71వ ఐఐటీ స్నాతకోత్సవం...ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ చేతుల మీదుగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మారుమూల గ్రామానికి చెందిన కూలీ కుటుంబానికి చెందిన పిడమర్తి అనిల్ కుమార్ గ్రాడ్యుయేట్ పట్టాను అందుకున్నారు.
అంతే...కూలీ కుటుంబం నుంచి ఖరగ్‌పూర్ ఐఐటీ దాకా సాగిన అనిల్ కుమార్ విజయ ప్రస్థానం తెలిసిన తోటి విద్యార్థులు చేసిన హర్షధ్వానాలతో నేతాజీ ఆడిటోరియం మార్మోగింది.
పట్టుదల, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చని నిరూపించారు మారుమూల గ్రామీణ ప్రాంతంలోని కూలీ కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు. సూర్యాపేట జిల్లాఆత్మకూరు (ఎస్) మండలంలోని తుమ్మల పెన్ పహాడ్ అనే చిన్న గ్రామంలో నిరుపేద కూలీ కుటుంబంలో జన్మించిన పిడమర్తి అనిల్ కుమార్ ఖరగ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో చదువుకొని, స్టార్టప్ కంపెనీని నెలకొల్పాడు. బాల్యం నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగిన అనిల్ కుమార్ అడుగడుగునా ఎదురైన ఆటంకాలను అధిగమించి ఐఐటీ దాకా వెళ్లి స్టార్టప్ కంపెనీని నెలకొల్పి జీవితంలో విజయం సాధించాడు. సక్సెస్ కు చిరునామాగా నిలిచిన పిడమర్తి అనిల్ కుమార్ విజయగాథ (success story IIT Graduate) ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
ఖరగ్ పూర్ ఐఐటీ స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంటున్న పిడమర్తి అనిల్ కుమార్
‘‘ ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందానని ప్రకటించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను ఈ మైలురాయిని చేరుకుంటున్నప్పుడు ఈ ప్రయాణాన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను.
తుమ్మల పెన్ పహాడ్ గ్రామం నుంచి నా కథ ప్రారంభం
నేను తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. నేను నా తల్లిదండ్రులు పడిన కష్టం, త్యాగాలను చూస్తూ పెరిగాను. నా తండ్రి గ్రామ పంచాయతీ చిరుద్యోగి,పేపరుబాయ్. మా అమ్మ కష్టపడి పనిచేసే దినసరి కూలీ. పేదరికాన్ని జయించాలంటే విద్య ఒక్కటే మార్గమని నమ్మి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి మెరుగైన జీవితం పొందడానికి అవిశ్రాంతంగా పనిచేశాను.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద ఉచితంగా చదువుకున్నా...
నా లాంటి వెనుకబడిన నిరుపేద కుటుంబానికి చెందిన పిల్లలు మెరుగైన ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను ప్రారంభించిన అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కస్కీం కింద నేను హుజూర్ నగర్ లోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశ పరీక్ష రాసి నా పాఠశాల విద్య 1వతరగతి నుంచి 10వతరగతి వరకు చదువుకోగలిగాను.
జీవితాన్ని మలుపుతిప్పిన గౌలిదొడ్డి కాలేజ్
పదో తరగతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటీ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రవేశపరీక్ష రాసి ఇంటరుతో పాటు ఐఐటీ కోచింగ్ తీసుకునేందుకు సీటు సంపాదించాను. ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ స్థాయి కోచింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన నాటి గురుకుల పాఠశాలల డైరెక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాలాంటి విద్యార్థులు పెద్ద కలలు కనే ధైర్యం పొందేలా చేశారు.
దాతల సాయంతో ఐఐటీ చదివా...
ప్రభుత్వం సాయంతో ఇంటరు దాకా ఉచితంగా చదువుకున్న నాకు ఖరగ్ పూర్ ఐఐటీలో సీటు వచ్చింది. ఏడాదికి లక్షన్నర రూపాయలు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు చెల్లింపు నా కుటుంబానికి సవాలుగా మారింది. మా అన్నయ్య కూడా చదువుతుండటంతో ఆర్థికంగా భారం అయింది.నా తల్లిదండ్రులు ఐఐటీ ఫీజు ఎలా చెల్లించాలని ఆందోళన చెందారు. సరిగ్గా ఇలాంటి సమయంలో నా కథ స్థానిక పత్రికల్లో రావడంతో అద్భుతం జరిగింది. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టరు సుభద్ర మేడమ్, మణికంఠేశ్వర్ రావు సార్ కీలకమైన ఆర్థిక సహాయం అందించారు. దీంతో పాటు దయగల వ్యక్తుల నుంచి సహాయం లభించింది. అలా ఖరగ్ పూర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను.
స్టార్టప్ కంపెనీని నెలకొల్పాను...
‘‘మనం ఒకరి కింద ఎందుకు పని చేయాలి? మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేం? మనం కంపెనీలను ఎందుకు ప్రారంభించకూడదు?’’ అనే కేటీఆర్ మాటలతో ప్రేరణ పొంది అచంచల విశ్వాసంతో లూప్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (LCM) అనే స్టార్టప్‌ను స్థాపించాను. ఒకప్పుడు సుదూరంగా అనిపించిన నా కలను సాకారం చేసుకున్నాను. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ చురుగ్గా డైనమిక్ గా పనిచేస్తూ నా కంపెనీని అభివృద్ధి చేస్తున్నాను.నన్ను నమ్మి, నాకు మార్గనిర్దేశం చేసి, నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ, నా ఉపాధ్యాయులకు, మార్గదర్శకులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఉదార శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. మీరు నా కలను సాధ్యం చేశారు’’అని పిడమర్తి అనిల్ కుమార్ తన విజయయాత్రను ముగించారు.
కేటీఆర్ అభినందన
గ్రామీణ యువకుడు పిడమర్తి అనిల్ కుమార్ స్టార్టప్ కంపెనీని నెలకొల్పి విజయతీరానికి చేరడంపై మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు.మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు స్టార్టప్ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను, మీరు మరిన్ని విజయాలు సాధించాలి.ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారండి’’అని కేటీఆర్ అనిల్ కుమార్ విజయ ప్రస్థానంపై ఎక్స్ లో అభినందనలు తెలిపారు.