‘రాజీవ్ యువ వికాసం’లోకి ఎస్సీ వర్గీకరణ..!
దరఖాస్తులను మూడు ఉపవర్గాలుగా విభజించి 1, 9, 5 శాతం రిజర్వేషన్ల విధానం ప్రకారం ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.;
యువతకు చేయూతనందించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘రాజీవ్ యువ వికాసం’. ఈ పథకం కింద యువతకు ఆర్థిక సహాయం, తక్కువ వడ్డీకి రుణాలను అందించి వారి సాధికారతకు దోహదపడుతుంది. ఈ పథానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ పథకం అమలు విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ముప్పై సంవత్సరాలు పోరాడి ఎస్సీలు సాధించిన ఎస్సీ వర్గీకరణను ఈ పథకం అమలులో కూడా భాగం చేయాలని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ పథకానికి 44.800 ఎస్సీ సామాజికవర్గానికి చెందిన దరఖాస్తులు అందాయి. వాటిని మూడు ఉపవర్గాలుగా విభజించి 1, 9, 5 శాతం రిజర్వేషన్ల విధానం ప్రకారం ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఎస్సీ గ్రూప్-బీ నుంచి అత్యధిక దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులపై అతిత్వరలో కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టి, అర్ములైన లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు యూనిట్ మంజూరు పత్రాలను అందిస్తారు. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.6వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అసలేంటీ పథకం..
యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రభుత్వ ప్రవేశపెట్టింది. యువత తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఆకాంక్షతోనే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, ఈ పథకం కోసం రూ.10వేల కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఈ పథకానికి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సబ్సిడీలతో పాటు రూ.3 లక్షల వరకు రాయితీ రుణాలను అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం యువ వ్యవస్థాపకులకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చి వారి ఆర్థికాభివృద్ధితో పాటు నిరుద్యోగాన్ని తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.