బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల్లో 25 వ తేదీ టెన్షన్ పెరిగిపోతోందా ?

పైకి ఎంత చెప్పుకున్నా, ఎంత గంభీరమైన మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల్లో అనర్హత భయం మొదలైందన్నది మాత్రం వాస్తవం;

Update: 2025-03-21 07:24 GMT
BRS defected MLAs

పైకి ఎంత చెప్పుకున్నా, ఎంత గంభీరమైన మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల్లో అనర్హత భయం మొదలైందన్నది మాత్రం వాస్తవం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో పదిమంది కాంగ్రెస్ లోకి ఫిరాయించింది నూరుశాతం కరెక్టు. ఈ విషయంలో ఈనెల 25వ తేదీ విచారణలో సూప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో ? ఏమి ఆదేశిస్తుందో అనే టెన్షన్ ఫిరాయింపుల్లో పెరిగిపోతోంది. ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS Defected MLAs)పై అనర్హత వేటు వేయించేందుకు ఎప్పుడైతే బీఆర్ఎస్ న్యాయపోరాటం మొదలుపెట్టిందో అప్పటినుండో వీళ్ళల్లో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ అనర్హత పిటీషన్లను హైకోర్టు కొట్టేసిన వెంటనే బీఆర్ఎస్ సుప్రింకోర్టులో పిటీషన్లు వేసింది. ఇప్పటికే చాలాసార్లు సుప్రింకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపధ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు జరుగుతున్న ప్రచారం తప్పని పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి సుప్రింకోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు.

తన నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి(Revanth)ని కలిసినట్లు ఇపుడు చెబుతున్నారు. కాని గూడెం కలిసినపుడు రేవంత్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారని అప్పట్లో ఫిరాయింపు ఎంఎల్ఏ మద్దతుదారులే ప్రచారం చేసుకున్నారు. దాంతో మీడియాలో కూడా కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి అనే వచ్చింది. ఒక్క గూడెమే కాదు మరో తొమ్మిది ఎంఎల్ఏలు కూడా తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లుగానే కలరింగ్ ఇచ్చుకున్నారు. వీళ్ళు పదిమంది పార్టీఫిరాయించారు అనేందుకు రెండు ఆధారాలను కేటీఆర్ చూపిస్తున్నారు. అవేమిటంటే రేవంత్ ను కలిసి కండువా కప్పుకున్న తర్వాత జరిగిన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నిర్వహించిన మీటింగుల్లో ఏ ఒక్కదానికీ హాజరుకాలేదు. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సమావేశాలకు కూడా వీళ్ళు హాజరుకాలేదు. రెండో ఆధారం ఏమిటంటే బీఆర్ఎస్ మీటింగులకు హాజరుకాకపోగా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నేతలతోనే కలిసి తిరుగుతున్నారు.

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రింకోర్టులో గట్టిగా పోరాటం చేస్తుండటంతో వీళ్ళల్లో టెన్షన్ మొదలైనట్లుంది. అందులోను సుప్రింకోర్టు కూడా ఫిరాయింపుల విచారణ విషయంలో అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇచ్చి హడావుడి చేస్తోంది. దాంతో విషయం సీరియస్ అవబోతోందని ఫిరాయింపులకు అర్ధమైనట్లుంది. అప్పటినుండే రివర్స్ గేర్ మొదలుపెట్టారు. గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రివర్సులో మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం బండ్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తన అనుమతిలేకుండానే తన ఫొటోలను కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో వాడుతున్నట్లు ఫిర్యాదులో చెప్పారు. కారణమైన వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకోవాలని, తన ఇమేజిని కాపాడాలని ఫిర్యాదులో బండ్ల విజ్ఞప్తిచేశారు. అంతకుముందు శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ కూడా ఇలాగే మాట్లాడారు.

తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనపై బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) నానా గొడవచేశారు. గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నది వాస్తవం అయితే తనతో పాటు పార్టీ ఆఫీసుకు రావాలని ఫిరాయింపు ఎంఎల్ఏ ఇంటిముందుకు వెళ్ళి రెండురోజులు పెద్ద గొడవ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలాంటి నేపధ్యంలోనే తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అని చెప్పి తాజాగా గూడెం సుప్రింకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ దాఖలుతోనే గూడెంలో అనర్హత టెన్షన్ ఏస్ధాయిలో పెరిగిపోతోందో అర్ధమవుతోంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పదిమంది ఎంఎల్ఏల పేర్లను కూడా సుప్రింకోర్టులో చెప్పారు.

శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, బాన్స్ వాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు కేటీఆర్ తన పిటీషన్లో ఆరోపించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు కాబట్టి వీళ్ళందరిపైన వెంటనే అనర్హత వేటు వేయాలన్నది కేటీఆర్ వాదన.

ఇపుడు సుప్రింకోర్టు జరుపుతున్న విచారణనే గతంలో హైకోర్టు చేసింది. అయితే బీఆర్ఎస్ వాదన, ఫిరాయింపుల తరపు వాదన, అసెంబ్లీ స్పీకర్ తరపు లాయర్ వాదనను హైకోర్టు సాంతం విన్నది. తర్వాత శాసన వ్యవస్ధ అధికారాల్లోకి న్యాయవ్యవస్ధ జోక్యం చేసుకునేందుకు లేదని చెప్పి బీఆర్ఎస్ దాఖలుచేసిన పిటీషన్ను కొట్టేసింది. అందుకనే కేటీఆర్ సుప్రింకోర్టులో సవాలుచేసింది. ఇప్పటికే చాలాసార్లు విచారించిన సుప్రింకోర్టు ఈనెల 25వ తేదీన జరగబోయే విచారణలో సుప్రింకోర్టు ఎలాగ రియాక్టవుతుందో అర్ధంకావటంలేదు. స్పీకర్ ను ఏమి ఆదేశిస్తుంది ? ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అనే ఆసక్తి పెరిగిపోతోంది. ఫిరాయింపులను విచారించటానికి ఎంతకాలంపడుతుందో చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది. 

ఈ ముగ్గురూ ఏమిచేస్తారో ?

ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఏడుమంది వాదనలు ఎలాగున్నా ముగ్గురు ఎంఎల్ఏలు ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. తాము కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని కొందరు చెబుతున్నారు. అయితే ముగ్గురు ఎంఎల్ఏలకు మాత్రం ఆ అవకాశంలేదన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీచేశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా ఎలా పోటీచేస్తారు ? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదించకుండానే శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీకి స్పీకర్ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి(పీఏసీ) ఛైర్మన్ గా ఎలా నియమించారు ? పీఏసీ ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. అయితే తమ పార్టీలో పీఏసీ ఛైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలన్నది అధినేత కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ పీఏసీ ఛైర్మన్ పదవిని గాంధీకి ఇవ్వమని స్పీకర్ కు లేఖ రాయలేదు. ఇక బాన్సువాడ బీఆర్ఎస్ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ రంగం సలహాదారుగా నియమించింది. ఈ ముగ్గురు ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు అనేందుకు ఆధారాలుగా బీఆర్ఎస్ చూపిస్తోంది. మరి వీటిని ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.

ఈ నేపధ్యంలోనే సుప్రింకోర్టు నోటీసుకు స్పీకర్ కార్యాలయం ఏమి సమాధానం ఇచ్చిందనేది సస్పెన్సుగా మారింది. ఇదే విషయమై ఒకసందర్భంలో రేవంత్ మాట్లాడుతు బీఆర్ఎస్ పదిమంది ఎంఎల్ఏలపై ఎట్టి పరిస్ధితుల్లోను అనర్హత వేటుపడదని గట్టిగా చెప్పారు. మరి ఏ ధైర్యంతో రేవంత్ ఆమాటన్నారో తెలీదు. శాసనవ్యవస్ధ అధికారాల్లోకి న్యాయవ్యవస్ధ జొరబడటాన్ని స్పీకర్ ప్రశ్నిస్తే అదో పెద్ద వివాదమవుతుంది. అప్పుడు సుప్రింకోర్టు ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈలోపు ఫిరాయింపుల్లో టెన్షన్ పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News