6 డిమాండ్లతో హరీష్ లేఖ
మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇంకా పెండింగులో ఉన్నాయని తెలిపారు;
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు ఆరుడిమాండ్లతో లేఖ రాశారు. లేఖలో చేసిన డిమాండ్లను మంత్రి వెంటనే నెరవేర్చాలని హరీష్(Harish Rao) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గ్రామాల స్ధితి, పంచాయితీ కార్యదర్శుల పరిస్ధితి దయనీయంగా మారిందని తన లేఖలో ప్రస్తావించారు. తమ హయాంలో గ్రామపంచాయితీలకు ఇచ్చిన నిధులు, ప్రజాప్రతినిధుల, పంచాయితీ కార్యదర్శుల పనితీరు వల్ల దేశంలోనే తెలంగాణ గ్రామాలు ఆదర్శంగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అవసరమైన నిదులు రాకపోవటంతో పంచాయితీ కార్యదర్శులు తమ సొంత నిధులనే ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు.
మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇంకా పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఆ బిల్లులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేయించేట్లుగా మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్ధానిక సంస్ధలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే బిల్లులు మంజూరులో మరింత ఆలస్యం అవుతుందని హరీష్ ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి వెంటనే బిల్లులన్నీ వెంటనే రిలీజ్ చేయాలని లేఖలో మంత్రి సీతక్క(Minister Seetakka)ను కోరారు. హరీష్ 6 డిమాండ్లు ఏమిటంటే పంచాయితీలకు పెండింగులో ఉన్న బిల్లులన్నీ వెంటనే మంజూరు చేయాలని, మాజీ సర్పంచులు చేసిన పనుల బిల్లులు రిలీజ్ చేయాలని, అభయహస్తం మేనిఫెస్టో ప్రకారం ఔట్ సోర్సింగులో విధానంలో పనిచేస్తున్న పంచాయితీ కార్యదర్శులను జూనియర్ పంచాయితి కార్యదర్శలుగా నియమించాలని, వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని, మూడునెలలుగా పెండింగులో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.